అదేంటో చిరంజీవి ఈ మధ్య సోషల్ మీడియాకు తరచుగా టార్గెటవుతున్నారు. అలా అనడం కంటే అవకాశం ఇస్తున్నారు అని చెప్పొచ్చు. తాజాగా మౌని రాయ్ తో షూట్ చేసిన విశ్వంభర స్పెషల్ సాంగ్ తాలూకు ఫోటో ఒకటి బయటికి వచ్చింది. అంతే ఒక్కసారిగా ట్రోలర్స్ మేల్కొన్నారు. నిజానికి ఏడు పదుల వయసులో మెగాస్టార్ చాలా చలాకీగా, గ్లామరస్ గా ఉన్నారు. కానీ వేసుకున్న కాస్ట్యూమ్, దానికి సింక్ కుదరని రఫ్ బ్యాక్ గ్రౌండ్ విమర్శలకు తావిచ్చాయి. ముఖ్యంగా కొణిదెల సుస్మిత డిజైన్ చేస్తున్న దుస్తుల గురించి అభిమానులు ఎప్పటి నుంచో అసంతృప్తి వ్యక్తం చేయడం దాస్తే దాగే వాస్తవం కాదు.
ఇప్పుడు ఫ్యాన్స్ కోరుకుంటున్నది ఒకటే. ఇలా సెట్స్ లో తనతో నటించిన యాక్టర్స్ తో ఫోటోలు దిగేసి వాటిని బయటికి ఇవ్వకుండా ఏదైనా అఫీషియల్ పోస్టర్స్ లేదా మేకింగ్ వీడియోస్ వదలమని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే చిరంజీవితో ఫోటోలు దిగుతున్న వాళ్ళు ఎవరైనా సరే మొబైల్ కెమెరాతో షూట్ చేసి వాటిని ఇన్స్ టా, ఎక్స్ లో పోస్ట్ చేస్తున్నారు. అవి కాస్తా ఇంకోలా కనిపించి ఇంప్రెషన్ తగ్గించేస్తున్నాయి. నిజానికి ఇదే సాంగ్ ని లైవ్ లో ప్రత్యక్షంగా చూసినవాళ్లు చిరు గ్లామర్, ఎనర్జీకి ఆశ్చర్యపోతున్నారు. ఈయనేంటి వాల్తేర్ వీరయ్య కంటే చలాకీగా మారాడని మాట్లాడుకుంటున్నారు.
కానీ ఆన్ లైన్ లో జరుగుతున్న తతంగం వేరే. అయినా విశ్వంభరకు జరిగిన ఆలస్యానికి ఏదైనా కొత్త కంటెంట్ వదిలితే బాగుంటుంది కానీ ఇలా సెట్స్ మీద పిక్స్ రిలీజ్ చేయడం వల్ల కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువ. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణతో విశ్వంభర షూట్ మొత్తం ముగియనుంది. విఎఫెక్స్ క్వాలిటీ మీద పూర్తి సంతృప్తి కలిగాకే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని చెబుతున్న దర్శకుడు వశిష్ఠ ఏదో పది రోజుల్లో విడుదల ఉందనే రేంజ్ లో మీడియాకు వరసబెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు. ఆయన మాటల్లో కాన్ఫిడెన్స్ చూస్తుంటే జగదేకవీరుడు అతిలోకసుందరి రేంజ్ లో ఎలివేషన్లున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates