ఒకప్పుడు కోలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఉండేవాడు మురుగదాస్. తమిళంలో ఆయన రూపొందించిన రమణ, గజిని, కత్తి, తుపాకి సినిమాలు మామూలు హిట్లు కాదు. ‘రమణ’ తెలుగులోకి ‘ఠాగూర్’ పేరుతో రీమేక్ అయి ఇక్కడ ఇండస్ట్రీ హిట్ అయింది. ‘గజిని’ తెలుగులోకి అనువాదమై ఇక్కడా బ్లాక్ బస్టర్ అయింది. హిందీలో మురుగదాసే డైరెక్ట్ చేయగా.. అక్కడా భారీ విజయాన్నందుకుంది. దీంతో ఇటు తెలుగులో, అటు హిందీలోనూ ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు. తెలుగులో తర్వాత మెగాస్టార్ చిరంజీవితో మురుగదాస్ తీసిన ‘స్టాలిన్’ ఓ మోస్తరు ఫలితాన్నందుకుంది. ఐతే గత కొన్నేళ్లుగా మురుగదాస్‌కు అస్సలు కలిసి రావడం లేదు. తెలుగులో ‘స్పైడర్’, హిందీలో ‘సికందర్’ దారుణమైన ఫలితాన్నందుకున్నాయి.
తమిళంలో దర్బార్ కూడా సరిగా ఆడలేదు. ‘సికందర్’ రిజల్ట్ చూశాక మురుగదాస్ పనైపోయిందని తేల్చేశారంతా. ఐతే తమిళంలో శివకార్తికేయన్ హీరోగా రూపొందిస్తున్న ‘మదరాసి’తో బౌన్స్ బ్యాక్ అవుతానని ధీమాగా ఉన్నాడు మురుగ. ఈ సందర్భంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో తమిళేతర భాషల్లో అనుకున్నంతగా తాను సక్సెస్ కాకపోవడంపై మాట్లాడారు. తాను వేరే భాషలకు, ముఖ్యంగా హిందీకి వెళ్తే సినిమా తీయడంలో హ్యాండిక్యాప్డ్ అయిపోతానని చెప్పాడు.
‘‘నా మాతృభాషలో సినిమాలు తీయడం నాకు సులువు. ఇక్కడి వారికి ఎలాంటి కథ నచ్చుతుందో నాకు తెలుసు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే క్యాప్షన్ల మీదా నాకు అవగాహన ఉంది. ఇక్కడి యువత అభిరుచులేంటో తెలుసు. కానీ వేరే భాషలకు వెళ్తే కష్టం. తెలుగు వరకు కొంత పర్వాలేదు. కానీ హిందీ సంగతి వేరు. నేను స్క్రిప్టు ఇస్తాను. వాళ్లు దాన్ని ఇంగ్లిష్‌లోకి, తర్వాత హిందీలోకి అనువదిస్తారు.
నేను రాసుకున్న సీన్ మీద నాకో అవగాహన ఉంటుంది. కానీ ఆ సీన్ తీసే సమయానికి డైలాగుల విషయంలో కన్ఫ్యూజన్ మొదలవుతుంది. అందుకే నేను హిందీ సినిమాలు తీసేటపుడు హ్యాండిక్యాప్డ్ అయిపోతాను’’ అని మురుగదాస్ తెలిపాడు. సికందర్ ఫెయిల్యూర్‌పై మురుగదాస్ పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. మరి అంత ఇబ్బంది ఉన్నపుడు ఇతర భాషల్లో మురుగదాస్ ఎందుకు సినిమా చేసినట్లో? అయినా ఇదే దర్శకుడు ‘గజిని’తో హిందీలో భారీ విజయాన్నందుకున్నాడు కదా?
Gulte Telugu Telugu Political and Movie News Updates