అధిక రేట్లు ఎంత చేటో అర్థమైందా?

రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక టికెట్ల ధరలు పెంచుకోవడం, బెనిఫిట్ షోలు వేసుకోవడం తేలికైపోయింది. గత ఏడాది పుష్ప-2 రిలీజ్ టైంలో చోటు చేసుకున్న విషాదం వల్ల తెలంగాణలో అదనపు రేట్లు, బెనిఫిట్ షోలకు అనుమతులు ఆగిపోయాయి కానీ.. ఏపీలో మాత్రం వాటికి ఏ ఇబ్బందీ లేదు. ‘హరిహర వీరమల్లు’ సినిమాకైతే తెలంగాణ ప్రభుత్వం కూడా మినహాయింపు ఇచ్చింది. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా అన్న కారణంతో ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఉన్న రేట్లను దాదాపు డబుల్ చేసుకున్నారు. ఏపీలో కూడా రేట్లు దాదాపు డబుల్ అయ్యాయి. 

కానీ ఆ రేట్ల వల్ల నిర్మాత, బయ్యర్లు లాభపడ్డారా.. నష్టపోయారా అంటే రెండోదే సమాధానంగా కనిపిస్తోంది. ముందు రోజు టికెట్ రేటును రెండున్నర మూడు రెట్లకు పెంచి వేసిన ప్రిమియర్స్‌తో బాగానే ఆదాయం వచ్చింది. అది చూసి ఆహా ఓహో అనుకున్నారు. కానీ ఆ షోల నుంచి వచ్చిన నెగెటివ్ టాక్.. తొలి రోజు ఆక్యుపెన్సీల మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. ‘గుంటూరు కారం’ తరహలోనే సినిమాకు రావాల్సిన దాని కంటే ఎక్కువ నెగెటివ్ టాక్ రావడానికి ప్రిమియర్స్ కారణం అనడంలో సందేహం లేదు.

అసలే సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. పైగా టికెట్ల ధరలు ఎక్కువ. అలాంటపుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా థియేటర్లకు వస్తారు? బాలేని సినిమాకు సింగిల్ స్క్రీన్లో 300, మల్టీప్లెక్సులో 400-500 పెట్టి ఎవరైనా సినిమా చూస్తారా? ఫ్యామిలీని తీసుకుని వెళ్తే అయ్యే ఖర్చు ఎంత? పవన్ మీద అభిమానం ఉన్నా.. ఆయన ఎంతో కష్టపడి చేసిన సినిమాను ఎంకరేజ్ చెయ్యాలని అనిపించినా.. టికెట్ల ధరలకు భయపడి వెనుకంజ వేసిన ప్రేక్షకుల సంఖ్య పెద్దదే అనడంలో సందేహం లేదు. రేట్లు పెంచుకుని వీకెండ్లో సొమ్ము చేసుకుందామని అనుకుంటే.. ఆ సంబరం ప్రిమియర్స్, తొలి రోజు షోల వరకే పరిమితం అయింది. 

ఎలాంటి సినిమాకైనా రెండో రోజు వసూళ్లు డ్రాప్ అవడం కామనే కానీ.. ‘హరిహర వీరమల్లు’కు మాత్రం డ్రాప్ 70-80 శాతం ఉందంటే అందుకు నెగెటివ్ టాక్, అంతకుమించి అధిక రేట్లు కారణం అనడంలో సందేహం లేదు. ఇదే సినిమాను నార్మల్ రేట్లతో నడిపించి ఉంటే.. టాక్‌తో సంబంధం లేకుండా ఎక్కువమంది ప్రేక్షకులు చూసేవాళ్లు. ఆక్యుపెన్సీలు పెరిగేవి. తద్వారా ఆదాయం పెరిగేది. ఎక్కువ రేటు పెట్టి సినిమా చూసి, అది బాగా లేనపుడు.. జనం ఆ చిత్రం గురించి మరింత నెగెటివ్‌గా స్పందిస్తారు, ఒకింత ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తారు అనే విషయాన్ని కూడా ఇక్కడ ఆలోచించాలి. 

ఆల్రెడీ సౌత్ ఇండియా మొత్తంలో అధిక రేట్లు ఉన్నదే తెలుగు రాష్ట్రాల్లో. అలాంటిది మళ్లీ అదనపు రేట్లు వడ్డించడం టూమచ్. ప్రేక్షకులు రావాలనుకునేదే కాస్త క్రేజున్న సినిమాలకు. అలా క్రేజున్న సినిమాలకూ రేట్లు పెంచుకుంటూ పోతే ఇక ప్రేక్షకులు ఎందుకు థియేటర్లకు రావాలనుకుంటారు? డిమాండ్ లేని సినిమాలకు నార్మల్ రేట్లు పెట్టి ఏం ప్రయోజనం? వీకెండ్లో రేట్లు పెంచి సొమ్ము చేసుకోవాలనే నిర్మాతల ఆలోచన క్రమంగా ప్రేక్షకులను థియేటర్లకు మరింత దూరం చేస్తోందనే వాస్తవాన్ని గ్రహించకపోతే వెండితెరలు మున్ముందు మరింత వెలవెలబోవడం.. ఖాయం.