హిరణ్యకశ్యప.. టాలీవుడ్లో ఎప్పట్నుంచో వినిపిస్తున్న సినిమా పేరు. భారీ స్థాయిలో ఈ సినిమా తీయడానికి చాలా ఏళ్ల కిందటే సన్నాహాలు మొదలయ్యాయి. తన కెరీర్ క్లోజ్ అయిపోయిందనుకుంటున్న సమయంలో భారీ బడ్జెట్లో ‘రుద్రమదేవి’ లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీ తీసిన గుణ.. ఆ తర్వాత అంతకుమించిన సాహసోపేతంగా ‘హిరణ్యకశ్యప’ సినిమా తీయాలనుకున్నాడు. రానా దగ్గుబాటిని హీరోగా అనుకుని సురేష్ బాబును నిర్మాణానికి ఒప్పించి ఈ ప్రాజెక్టును ఘనంగా అనౌన్స్ చేశాడు.
కానీ ఏవో కారణాలతో ఆ ప్రాజెక్టును తాత్కాలికంగా ఆపి ‘శాకుంతలం’ సినిమా తీశాడు గుణ. దీని తర్వాత కచ్చితంగా ‘హిరణ్యకశ్యప’ను పట్టాలెక్కిస్తాడనే అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన్ని పక్కన పెట్టి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్లు సొంతంగా ‘హిరణ్య కశ్యప’ తీయడానికి రెడీ అయిపోయారు. దీని గురించి గత ఏడాది అధికారిక ప్రకటన కూడా వచ్చింది. త్రివిక్రమ్ రైటర్ కాగా.. దర్శకుడెవరన్నది అప్పుడు ప్రకటించలేదు. ఐతే తర్వాత ఈ సినిమా గురించి ఏ అప్‌డేట్ లేదు. మరి ఎప్పుడు హిరణ్యకశ్యప పట్టాలెక్కుతుందా అని చూస్తుంటే.. దానికి ఊహించని విధంగా బ్రేక్ పడేలా ఉంది.
కన్నడ నుంచి తాజాగా మహావతార నరసింహ అనే యానిమేషన్ మూవీ వచ్చింది. ముందు ఈ సినిమాను అందరూ లైట్ తీసుకున్నారు. కానీ ఈ సినిమా కన్నడలోనే కాక తెలుగు, హిందీలో అద్భుతమైన స్పందన తెచ్చుకుని బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. రోజు రోజుకూ స్క్రీన్లు, షోలు పెరుగుతున్నాయి. వసూళ్లు కూడా ఊహించని స్థాయిలో వస్తున్నాయి. ఇది భక్త ప్రహ్లాద కథతో తెరకెక్కిన సినిమా. హిరణ్య కశ్యపుడి పాత్ర ఇందులో ఎంతో కీలకం.
యానిమేషన్లో ఆ పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు. ఈ సినిమాకు ఇంత మంచి ఆదరణ దక్కాక మళ్లీ ఆ పాత్ర మీద ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిలిం తీయడం అంటే ఇబ్బందే. యానిమేషన్ మూవీకి, రియల్ మూవీకి తేడా ఉన్నా సరే.. ఈ తరం ప్రేక్షకులు చూసేసిన కథ, పాత్రతో మళ్లీ పెద్ద బడ్జెట్లో సినిమా తీసి దాన్ని వర్కవుట్ చేయడం అంత తేలిక కాదు. పైగా ఈ సినిమాకు ప్రొడక్షన్ పరంగా ఏవో ఇబ్బందులున్నట్లున్నాయి. అందుకే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కాబట్టి ఈ సినిమా నిజంగా పట్టాలెక్కుతుందా అన్నది సందేహమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates