కింగ్డమ్ బిజినెస్ లక్ష్యం ఎంత

గురువారం విడుదల కాబోతున్న కింగ్డమ్ మీద టీమ్ లోనే కాదు పరిశ్రమ వర్గాల్లోనూ  భారీ అంచనాలున్నాయి.  ఇండస్ట్రీ హిట్ అవుతుందని భావించిన హరిహర వీరమల్లు ఆశించిన స్థాయిలో ఆడే సూచనలు తగ్గిపోవడంతో ఇప్పుడు బాక్సాఫీస్ కు ఉత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత విజయ్ దేవరకొండ మీద ఉంది. సాలిడ్ గా రెండు వారాలకు ఓపెన్ గ్రౌండ్ దొరకనున్న నేపథ్యంలో వీలైనంత వసూళ్లు ఆలోగానే రాబట్టుకోవాలి. ఆగస్ట్ 14 కూలి, వార్ 2 ఒకేసారి దిగుతాయి. అప్పటి నుంచి ఆడియన్స్ మూడ్ వాటివైపుకి షిఫ్ట్ అయిపోతుంది. అందుకే ప్రమోషన్ల పరంగా ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇక థియేటర్ బిజినెస్ విషయానికి వస్తే సుమారు 100 కోట్ల గ్రాస్ లక్ష్యంతో కింగ్డమ్ బరిలో దిగుతోంది. అంటే షేర్ కొంచెం అటు ఇటుగా 55 కోట్ల దాకా రావాల్సి ఉంటుంది. నైజాం 15 కోట్లు, సీడెడ్ 6 కోట్లు, ఆంధ్ర 15 కోట్లు, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలు 3.5 కోట్లు, ఓవర్సీస్ 10 కోట్లు, ఇతర డబ్బింగ్ వెర్షన్లు 4 కోట్ల దాకా డీల్స్ జరిగినట్టు ట్రేడ్ టాక్. బ్రేక్ ఈవెన్ కావాలంటే బ్లాక్ బస్టర్ టాక్ వల్లే సాధ్యం. ట్రైలర్ తో సరిపడా బజ్ వచ్చేసింది. కెజిఎఫ్ రేంజ్ లో ఎలివేషన్లు, యాక్షన్లు ఉన్నాయనే క్లారిటీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఇవ్వడంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక కావాల్సిందల్లా టాక్ మాత్రమే.

ముందు రోజు ప్రీమియర్లు వేసే సూచనలు తగ్గిపోతున్నాయి. బుధవారం షోల ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువ కలుగుతున్న నేపథ్యంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. సోమవారం హైదరాబాద్ యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత హైప్ మరింత ఎగబాకుతుందనే నమ్మకంతో టీమ్ ఉంది. కాంపిటీషన్ ఏది లేదు కాబట్టి పబ్లిక్ నుంచి కింగ్డమ్ కు మంచి మద్దతు దక్కితే వంద కోట్ల గ్రాస్ పెద్ద కష్టమేమి కాదు. అసలే ఫ్లాపులతో ఉన్న విజయ్ దేవరకొండ దీంతో సాలిడ్ కంబ్యాక్ ఇస్తాననే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. ట్రైలర్ చూశాక ఆ నమ్మకమైతే కలిగింది. నిలబెట్టుకోవడమే బ్యాలన్స్.