హోంబాలే సంస్థకు ‘నరసింహ’ వరం

కెజిఎఫ్, కాంతార లాంటి సినిమాలతో శాండల్ వుడ్ ని ఎక్కడికో తీసుకెళ్లిన హోంబాలే ఫిలిమ్స్ కి పట్టిందల్లా బంగారం అవుతోంది. తెలుగులో సలార్ తో ఎంట్రీ ఇచ్చి ప్రభాస్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ తోనే మరో మూడు ప్యాన్ ఇండియా మూవీస్ ప్లాన్ చేస్తున్న ఈ బ్యానర్ కు తాజాగా ఇంకో జాక్ పాట్ తగిలింది. శుక్రవారం విడుదలైన యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహకు అంచనాలకు మించి కలెక్షన్లు దక్కుతున్నాయి. నిజానికి ట్రైలర్ వచ్చాక కూడా దీని మీద పెద్దగా బజ్ లేదు. ఒక వర్గం ఆడియన్స్ మాత్రం మొదటి రోజు వెళ్లారు. మార్నింగ్ షోల వరకు ఆక్యుపెన్సీలు అంతంత మాత్రమే. కానీ గంటల వ్యవధిలో సీన్ రివర్స్ అయ్యింది.

ముఖ్యంగా వీకెండ్ బుకింగ్స్ అరాచకం అనిపించే స్థాయిలో ఉన్నాయి. హరిహర వీరమల్లు ధాటిని తట్టుకుంటుందా అనే అంచనాలని మించి హౌస్ ఫుల్స్ బోర్డులతో థియేటర్లను కిక్కిరిసిపోయేలా చేయడం ఊహించని ట్విస్టు. ఆదివారం ఉదయం గంటకు 27 వేల దాకా టికెట్లు అమ్మిన బుక్ మై షోలో రాత్రికి సైతం 10 వేలకు తగ్గకుండా దూకుడు కొనసాగించడం విశేషం. కేవలం సైయారా మాత్రమే దీనికి ధీటుగా నెంబర్లు నమోదు చేయడం మరో ట్విస్టు. వీరమల్లు కూడా ట్రెండింగ్ చూపించినప్పటికీ పవన్ కళ్యాణ్ స్థాయిలో కాదనేది వాస్తవం. హాలీవుడ్ మూవీ ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మెరుగ్గానే కనిపించింది.

ఇక మహావతార్ నరిసింహ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో మొదటి నలభై నిముషాలు, చివరి అరగంట జనాలకు పూర్తి పైసా వసూల్ అనిపించేస్తున్నాయి. మాస్ ఎలివేషన్లు ఇచ్చి నరసింహావతారంలో శ్రీవిష్ణువు హిరణ్యకశిపుడిని హతమార్చే ఎపిసోడ్ కు ఈలలు కేకలతో థియేటర్లు హోరెత్తిపోతున్నాయి. గ్రాఫిక్స్ మూవీకి ఈ స్థాయి స్పందన గత కొన్నేళ్లలో దేనికీ రాలేదన్నది వాస్తవం. వీక్ డేస్ లో మరింత పికప్ ఉంటుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. విష్ణు అవతరాలన్నీ యానిమల్ సిరీస్ గా తేవాలనే ప్లాన్ లో ఉన్న హోంబలీ ఫిలిమ్స్ కి ఇప్పుడీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇంకా బాగా తీయాలనే కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేసింది.