విశ్వంభర ఐటెం సాంగ్.. కీరవాణి సలహాతోనే

బాలీవుడ్లో ఒక సినిమాకు వేర్వేరు సంగీత దర్శకులు పాటలు అందించడం.. బ్యాగ్రౌండ్ స్కోర్‌ బాధ్యతల్ని కూడా ఇద్దరు పంచుకోవడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. కానీ దక్షిణాదిన ఈ ఒరవడి ఇంకా ఊపందుకోలేదు. పాటలైనా, నేపథ్య సంగీతమైనా ఒక్కరే చేయాలని కోరుకుంటారు. పాటలు ఒకరు, నేపథ్య సంగీతం ఒకరు చేయడం కొన్ని సినిమాల విషయంలో జరుగుతోంది. కానీ పెద్ద సంగీత దర్శకులు ఈ రెండు పనులూ తామే చేయాలనుకుంటారు. 

గత ఏడాది ‘పుష్ప-2’కు సంబంధించి కొన్ని సీన్లకు బ్యాగ్రౌండ్ స్కోర్ బాధ్యతలను వేరే వాళ్లకు ఇస్తే దేవిశ్రీ ప్రసాద్ ఎంత హర్ట్ అయ్యాడో తెలిసిందే. ఇక వర్తమానంలోకి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘విశ్వంభర’కు కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ఇందులో ఒక ఐటెం సాంగ్‌ను భీమ్స్ సిసిరోలియోతో చేయించడం చర్చనీయాంశంగా మారింది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్‌ను ‘విశ్వంభర’ టీం అవమానించిందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ‘విశ్వంభర’ దర్శకుడు వశిష్ఠ స్పందించాడు. ఈ సినిమాలో ఐటెం సాంగ్‌ను భీమ్స్‌తో చేయించడంలో ఎలాంటి వివాదం లేదని.. తాము కీరవాణిని అవమానించాం అనడం తప్పని అతను వివరణ ఇచ్చాడు. ఈ సినిమాకు ఈ పాట చేయాల్సిన సమయంలో కీరవాణి.. ‘హరిహర వీరమల్లు’ నేపథ్య సంగీతం పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారని అతను వెల్లడించాడు. ఈ పాటను వేరే సంగీత దర్శకుడితో చేయిద్దాం అని ఆయనే సలహా ఇచ్చినట్లు అతను తెలిపాడు. 

అదేంటి సార్ అని అడిగితే.. ‘ఒక పాటను ఒకరు రాస్తే మరో పాటను ఇంకొకరు రాస్తారు. ఇదీ అంతే’ అని కీరవాణి బదులిచ్చినట్లు వశిష్ఠ వెల్లడించాడు. ‘బింబిసార’కు చిరంతన్ భట్‌తో కలిసి పని చేసిన విషయాన్ని కీరవాణి గుర్తు చేశారని.. భీమ్స్‌తో ఈ పాట చేయిద్దామని చిరంజీవికి కూడా కీరవాణినే చెప్పి ఒప్పించినట్లు వశిష్ఠ తెలిపాడు. సినిమా ఆలస్యం కాకూడదన్నదే కీరవాణి ఉద్దేశమని.. ఇందులో ఎలాంటి వివాదం లేదని వశిష్ఠ స్పష్టం చేశాడు.