టాలీవుడ్ లెజెండరీ రైటర్లలో ఒకడు పోసాని కృష్ణమురళి. 90వ దశకంలో ఆయన బోలెడన్ని సినిమాలకు రచయితగా పని చేశారు. ఆయన రైటర్‌గా పని చేసిన సినిమాల సంఖ్య వందకు పైమాటే. తర్వాత ఆయన దర్శకుడిగా కూడా మారారు. ‘ఆపరేషన్ దుర్యోధన’ లాంటి హిట్ సినిమాను అందించారు. కానీ తర్వాత ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలేవీ ఆడలేదు. ఆపై ఆయన నటుడిగా బిజీ అయిపోయారు. ఆపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లో తలమునకలయ్యారు.
వైసీపీ అధికారం కోల్పోయాక ఇటు రాజకీయంగా, అటు నటుడిగా ఆయన ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. నటుడిగా అవకాశాలు దాదాపు ఆగిపోయాయి. వైసీపీ అధికారంలో ఉన్నపుడు అదుపు తప్పి మాట్లాడిన ఫలితంగా ఈ మధ్య అనేక కేసులు ఎదుర్కొని కొన్ని రోజులు జైలు జీవితం గడిపి వచ్చారు. ప్రస్తుతం పోసాని రాజకీయాలకు పూర్తిగా దూరమైనట్లే కనిపిస్తున్నారు. ఈ స్థితిలో పోసాని తిరిగి దర్శకత్వం చేయడానికి రెడీ అవడం విశేషం.
తన దర్శకత్వంలో ఒక సినిమాను ఆయన అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి అరుణారెడ్డి లేదా ఆపరేషన్ అరుణారెడ్డి అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సినిమా కోసం తాను బహుముఖ పాత్రలు పోషించనున్నట్లు పోసాని తెలిపారు. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడంతో పాటు తన స్నేహితులతో కలిసి ప్రొడ్యూస్ కూడా చేయనున్నట్లు ఆయన చెప్పారు. అంతే కాక సినిమాలో తనే లీడ్ రోల్ చేస్తానన్నారు.
తన పాత్రలో రకరకాల షేడ్స్ ఉంటాయని.. హీరో, విలన్, క్యారెక్టర్ రోల్.. ఇలా తన నుంచి అనేక రకాల పాత్రలు చూడొచ్చని ఆయన చెప్పారు. అంటే పాత్రలోనే షేడ్స్ ఉంటాయా.. లేక వేర్వేరు పాత్రలను ఆయనే పోషిస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో తాను కాకుండా అందరూ కొత్త వాళ్లే నటిస్తారని ఆయన వెల్లడించారు. అందుకోసం ఏ రెకమండేషన్స్ అవసరం లేదని, నటనలో అనుభవం లేకపోయినా పర్వాలేదని.. ధైర్యం ఉంటే చాలని.. జస్ట్ ఫొటోలు పంపిస్తే అందులో ఎవరు బెస్టో చూసి సెలక్ట్ చేసుకుంటామని పోసాని తెలిపారు. అక్టోబరులో రాజస్థాన్‌లో ఈ సినిమా చిత్రీకరణ మొదలుపెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates