ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో లోకేష్ కనకరాజ్ ఒకడు. మానగరం అనే హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన అతను.. ఖైదీ మూవీతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. తర్వాత అతను తీసిన మాస్టర్ ఓ మోస్తరుగా ఆడగా.. విక్రమ్ బ్లాక్ బస్టర్ అయింది. తర్వాతి చిత్రం లియో అంచనాలను అందుకోకపోయినా లోకేష్ క్రేజ్ అయితే తగ్గలేదు. తన కొత్త సినిమా కూలీకి మామూలు హైప్ లేదు. లోకేష్ ఫ్యూచర్ ప్రాజెక్టుల లిస్ట్ పెద్దదే. ఖైదీ-2, విక్రమ్=2, రోలెక్స్ చిత్రాలతో పాటు ఆమిర్ ఖాన్‌తో సైతం ఒక సినిమాను ప్లాన్ చేశాడు. దర్శకుడిగా ఇంత బిజీగా ఉన్న అతను.. హీరోగా కూడా అరంగేట్రం చేయబోతున్నాడు. ప్రాపర్ కమర్షియల్ సినిమాతోనే తాను హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు అతను వెల్లడించాడు.
కీర్తి సురేష్‌తో సాని కాయితం, ధనుష్‌తో కెప్టెన్ మిల్లర్ సినిమాలు తీసిన అరుణ్ మాథేశ్వరన్.. లోకేష్‌ను హీరోగా పరిచయం చేయనున్నాడట. వీరి కలయికలో రాబోయేది గ్యాంగ్‌స్టర్ మూవీ అట. అందులో హీరో పాత్రకు తగ్గట్లుగా ఆల్రెడీ ప్రిపరేషన్ మొదలుపెట్టినట్లు ఒక ఇంటర్వ్యూలో లోకేష్ వెల్లడించాడు. కెప్టెన్ మిల్లర్ తర్వాత అరుణ్.. ధనుష్‌తో ఇళయరాజా బయోపిక్ చేయాల్సింది. కానీ ఆ సినిమా ఆలస్యం అవుతుండడంతో దాని కంటే ముందు లోకేష్ హీరోగా సినిమా చేయనున్నాడట.
ఈ సినిమా కోసం తాను బరువు తగ్గి, కండలు పెంచడంతో పాటు గడ్డం కూడా పెంచుతున్నట్లు లోకేష్ వెల్లడించాడు. తాను ఖైదీ-2 సినిమా మొదలుపెట్టడానికి 8 నెలలు పడుతుందని.. ఆ సినిమాకు స్క్రిప్టు రెడీగా ఉందని.. ఈలోపు హీరోగా సినిమాను పూర్తి చేస్తానని లోకేష్ తెలిపాడు. లోకేష్ ఇప్పటికే శ్రుతి హాసన్‌తో కలిసి ఇనిమేల్ అనే మ్యూజిక్ వీడియోలో నటించాడు. అందులో తన లుక్, స్క్రీన్ ప్రెజెన్స్, హావభావాలు బాగానే అనిపించాయి. నటుడిగా పనికొస్తాడనే గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఫీచర్ ఫిలిం హీరో అయిపోతున్నాడు. దర్శకుడిగా ఉన్న క్రేజ్ హీరోగా తన సినిమాకు కలిసొస్తుందని భావిస్తున్నారు. కూలీ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates