ఇండియన్ సినిమాల్లో క్రాస్ ఓవర్లు, మల్టీవర్స్‌లకు ఊపు తెచ్చిన దర్శకుడిగా లోకేష్ కనకరాజ్ పేరే చెప్పాలి. ఒక సినిమాలోని పాత్రలను మరో చిత్రంలోకి తీసుకొచ్చి క్రాస్ ఓవర్ సీన్స్ చేయడం ద్వారా ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చింది అతనే. అతను కమల్ హాసన్‌తో రూపొందించిన ‘విక్రమ్’లో ‘ఖైదీ’ సినిమా క్యారెక్టర్లు కనిపించడం.. కథ పరంగా రెండు చిత్రాలకూ కనెక్షన్ పెట్టడంతో ప్రేక్షకులకు అది భలేగా అనిపించింది. అప్పట్నుంచే ఎల్‌సీయూ (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్) అనే మాట పాపులర్ అయి.. అదొక ట్రెండుగా మారిపోయింది.
ఐతే అసలీ ఆలోచన ఎలా వచ్చింది.. ఎల్‌సీయూకు ఎలా పునాది పడింది అన్నది ఆసక్తికరం. తన కొత్త చిత్రం ‘కూలీ’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అతనీ విషయం వెల్లడించాడు. ‘‘మాస్టర్ సినిమా తర్వాత కమల్ హాసన్ గారు, నేను కలిసి ఒక సినిమా చేయాలనుకున్నాం. ఆయనే ‘విక్రమ్’ సినిమాకు ఐడియా ఇచ్చారు. స్క్రిప్టు రెడీ చేయడానికి నాకు ఆరు నెలల సమయం ఇవ్వమని అడిగాను. అప్పటికి నాకు ఆఫీస్ కూడా లేదు. కమల్ గారి రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బిల్డింగ్‌లోనే ఒక గది నాకిచ్చారు. అక్కడే నా అసిస్టెంట్ డైరెక్టర్లతో కలిసి కథా చర్చలు మొదలు పెట్టాను.
నాకు ‘ఖైదీ’ సినిమాలో నరేన్ చేసిన తరహలోనే ఒక పాత్ర ఇందులో పెట్టాలనిపించింది. దాని గురించి ఆలోచిస్తూ.. ఆ పాత్రనే ఇందులో ఎందుకు పెట్టకూడదు అనుకున్నాను. ఆ విషయం నా ఏడీలకు చెబితే.. బాగుండదన్నారు. నేను మరింత ఆలోచిస్తే.. అసలు ఆ కథకు, ఈ కథకు లింక్ పెట్టి కొన్ని క్యారెక్టర్లను ఇందులోకి తీసుకొస్తే తప్పేంటి అనిపించింది. రెండు కథల్లోని సారాంశం ‘సే నో టు డ్రగ్స్’యే కదా అనుకున్నా.
ఐతే ఈ ఐడియా చెబితే మా ఏడీలకు అసలు అర్థం కాలేదు. దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు. కానీ నేను మాత్రం స్క్రిప్టు పూర్తి చేసి.. కమల్ గారికి ఇచ్చేసి, నిర్ణయం ఆయనకే వదిలేశాను. ఆయనేం చెబుతారా అని రెండు రోజులు ఎదురు చూశాను. ఆయన ఈ ఐడియా బాగుందని, ఇలాగే చేద్దామని అన్నారు. హీరో, నిర్మాత ఆయనే కావడం, ఆయనకు నచ్చడంతో ‘ఎల్‌సీయూ’ ఐడియా అమల్లోకి వచ్చింది’’ అని లోకేష్ తెలిపాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates