సూర్య కూడా ఇలా చేస్తే ఎలా?

పర భాషా సినిమాలను తెలుగులోకి అనువాదం చేస్తూ ఒరిజినల్ టైటిళ్లను అలాగే పెట్టేయడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అసలు మనకు అర్థం కాని పదాలను అలాగే తెచ్చి తెలుగు వెర్షన్లకూ పెట్టేస్తుండడం విడ్డూరం. ఈ మధ్య మోహన్ లాల్ సినిమా ‘తుడరుమ్’ను అదే పేరుతో తెలుగులోనూ రిలీజ్ చేశారు. ఇది మన ప్రేక్షకులకు ఆగ్రహం తెప్పించింది. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా.. తెలుగులో ఆదరణ దక్కించుకోలేకపోయింది. అంతకుముందు రజినీకాంత్ సినిమాకు ‘వేట్టయాన్’ అని పెట్టి వదిలేశారు. అది పెద్ద మైనస్ అయింది. ఇలాంటి టైటిళ్లు పెట్టడం వల్ల నష్టమేంటో స్పష్టంగా అర్థమవుతున్నా మేకర్స్ మారట్లేదు.

ఐతే తెలుగు వారికి ఎంతో ఇష్టుడు.. ఇక్కడి వాళ్ల మీద ఎంతో ప్రేమ, గౌరవ భావం చూపించే తమిళ స్టార్ సూర్య సైతం ఇదే బాటలో నడుస్తుండడమే ఆశ్చర్యం కలిగించే విషయం. గత ఏడాది ‘కంగువ’ అనే సినిమాతో పలకరించాడు సూర్య. ఆ పేరేంటో మన వాళ్లకు అంతుబట్టలేదు. సినిమాలో విషయం లేకపోవడం సంగతి అటుంచితే.. అలాంటి టైటిల్ పెట్టి తెలుగులో రిలీజ్ చేయడం కరెక్ట్ కాదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు సూర్య తన కొత్త చిత్రానికి ‘కరుప్పు’ అని పేరు పెట్టుకున్నాడు. ఆర్జే బాలాజి డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. తమిళంలో ‘కరుప్పు’ అంటే ‘నలుపు’ అని అర్థం. కానీ సినిమాలో హీరో పేరు కరుప్పుస్వామి అట. అందుకని దాన్ని షార్ట్ చేసి ‘కరుప్పు’ అనే పేరు ఖరారు చేశారు.

కానీ ఇది హీరో పేరు అయినా సరే.. తెలుగులోనూ అదే టైటిల్ పెట్టి రిలీజ్ చేయడం అన్నది సరైన నిర్ణయమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ టైటిల్, పోస్టర్ చూడగానే తమిళ వాసనలు గుప్పుమన్నాయి. తెలుగు అంటే అభిమానం ఉన్న వాళ్లకు ఇలాంటి పేరు పెట్టిన సినిమాకు వెళ్లాలని ఎలా అనిపిస్తుంది? కథ పరంగా తమిళంలో ఆ పేరు పెట్టడమే కరెక్ట్ కావచ్చు కానీ.. తెలుగు మార్కెట్‌ను కూడా సూర్య దృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తే ఆ పేరు పెట్టాల్సింది కాదు. ఇది తెలుగులో కచ్చితంగా మైనస్ అయ్యే అవకాశముంది. తెలుగు వాళ్లంటే గౌరవం లేకుండా ఇలాంటి టైటిళ్లు పెడితే.. వాటికి ఇక్కడ అసలు బజ్ కూడా క్రియేట్ కావట్లేదు. ప్రేక్షకులు లైట్ తీసుకుంటున్నారు. ఇది గమనించి అనువాద చిత్రాలకు తెలుగు పేర్లు పెట్టడం మీద దృష్టిసారిస్తే మంచిది.