OG హీరోయిన్ మీద మార్కెటింగ్ కుట్ర ?

శర్వానంద్ శ్రీకారం, నాని గ్యాంగ్ లీడర్ తో మనకూ పరిచయమున్న ప్రియాంకా అరుళ్ మోహన్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓజి చేస్తున్న సంగతి తెలిసిందే. దీని షూటింగ్ అయిపోయింది కానీ ఈ సినిమా మీద అమ్మడు చాలా ఆశలు పెట్టుకుంది. టాలీవుడ్ మొదటి బ్లాక్ బస్టర్ దీంతో దక్కబోతోందని ఎదురు చూస్తోంది. సరిపోదా శనివారం మంచి పేరే తీసుకొచ్చినప్పటికీ అది పూర్తిగా నాని, ఎస్జె సూర్య డామినేషన్ లో నడవడంతో ఎక్కువ హైలైట్ కాలేకపోయింది. అయితే తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉన్న ప్రియాంకా మోహన్ మీద మార్కెటింగ్ కుట్ర జరుగుతోందని కోలీవుడ్ మీడియా వర్గాలు కోడై కూస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే ప్రియాంకా అరుళ్ మోహన్ కు మొన్నటిదాకా మార్కెట్ బాగానే ఉండేది. శివ కార్తికేయన్ తో డాన్ – డాక్టర్, సూర్య ఈటిలు మంచి హిట్లే ఇచ్చాయి. ధనుష్ కెఫైన్ మిల్లర్, జయం రవి బ్రదర్ ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయినా ఇమేజ్ పరంగా మరీ డౌన్ ఫాల్ అయితే రాలేదు. ప్రస్తుతం కెవిన్ తో చేస్తున్న మూవీ ఒకటే తన చేతిలో ఉంది. చెన్నై టాక్ ప్రకారం ప్రియాంక మోహన్ మీద ఒక పిఆర్ ఏజెన్సీ ఉద్దేశపూర్వకంగానే నెగటివ్ క్యాంపైన్ తో తనకు అవకాశాలు రాకుండా చేస్తోందట. ఒకప్పుడు ఇదే కంపెనీ కోలీవుడ్ టాప్ సెలబ్రిటీలతో పాటు ఈమెకు కూడా సేవలు అందించింది.

అయితే వీళ్ళ  పద్ధతి నచ్చక ప్రియాంకా కొన్ని నెలల క్రితం వాళ్ళతో ఒప్పందం రద్దు చేసుకుంది. దీన్ని అవమానంగా భావించిన సదరు సంస్థ కావాలనే తన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఫ్యాన్స్ కంప్లయింట్ చేస్తున్నారు. వీటి మీద అంత సులభంగా ఆధారాలు దొరకవు కాబట్టి ప్రస్తుతానికి ఇది ఆన్ లైన్ డిస్కషన్ కు మాత్రమే పరిమితమయ్యింది. జాబిలమ్మ నీకు అంత కోపమాలో తను స్పెషల్ సాంగ్ చేసినప్పుడు జరిగిన ట్రోలింగ్ వెనుక కూడా అదే పిఆర్ ఉన్నారని అభిమానులు అనుమానపడుతున్నారు. అందుకే అంటారు సినీ పరిశ్రమలో ఎవరికి ఎవరు ఏమి కారు, ఇక్కడంతా అవసరాల మీద నడిచే వారని.