కుర్రాడికి పాస్ మార్కులొచ్చాయి కానీ

నిన్న విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో సౌండ్ చేసింది జూనియర్ ఒక్కటే. నిర్మాణంలో భారీతనం, శ్రీలీల, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, కెకె సెంథిల్ ఛాయాగ్రహణం, బొమ్మరిల్లు జెనీలియా రీ ఎంట్రీ లాంటి ఆకర్షణలు మాస్ లో ఆసక్తి రేపాయి. రాజమౌళి గెస్టుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం ప్లస్ అయ్యింది. హీరోగా పరిచయమైన కిరీటి కుటుంబ నేపథ్యం రాజకీయం, వ్యాపారానికి సంబంధించినదే అయినా ప్రమోషన్ల విషయంలో అతను తీసుకున్న శ్రద్ధ హైప్ వచ్చేలా చేసింది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా స్క్రీన్లలో స్టార్ లెగసిలేని ఒక కుర్రాడి సినిమా రిలీజ్ కావడం విశేషమే. అయితే ఇంత సరంజామా పూర్తిగా వర్కౌట్ కావడం డౌటే.

కిరీటి తనవరకు పాస్ మార్కులు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా డాన్సులో జూనియర్ ఎన్టీఆర్, బన్నీ, చరణ్ లను తలపించేలా మాస్ స్టెప్స్ తో ఊపేశాడు. ముఖ్యంగా వైరల్ వయ్యారి సాంగ్ లో ఇతని ఆటాపాటలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. తొలి చిత్రమే కాబట్టి నటన పరంగా కిరీటి ఇంకా మెరుగుపడాల్సింది ఉంది.  అయితే డాన్స్, ఫైట్స్ లాంటి కీలక విభాగాల్లో తగినంత శిక్షణ తీసుకోవడం తెరమీద మంచి ఫలితాన్ని ఇచ్చింది. దర్శకుడు రాధాకృష్ణరెడ్డి తీసుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లేలో కొత్తదనం లేకపోవడంతో విఐపి 2, మహర్షి, శ్రీమంతుడు ఛాయలు కనిపించి కొంత రొటీన్ ఫీలింగ్ కలిగించాయి.

ముఖ్యంగా సెకండాఫ్ మీద కంప్లయింట్స్ ఎక్కువగా ఉన్నాయి. వీటి సంగతలా ఉంచితే కిరీటి తనకేమేం వచ్చో చూపించడానికి జూనియర్ ఒక వీడియో ప్రూఫ్ లా పనికొస్తుంది. ఈ మాత్రం చలాకీదనం, నృత్యం ఉంటే చాలు కోట్లు కుమ్మరించే నిర్మాతలు ఉండనే ఉంటారు. ఓపెనింగ్స్ జస్ట్ ఓకే అనిపించాయి తప్పించి ప్రత్యేకంగా అద్భుతం అనిపించే నెంబర్లు పెద్దగా నమోదు కాలేదు. వీకెండ్ రెండు రోజులు జూనియర్ కు కీలకం కానున్నాయి. సోమవారం ఉంచి ఎలాగూ డ్రాప్ ఉంటుంది కాబట్టి అది, శనివారాలు వీలైనంత రాబట్టుకోవడం అవసరం. మరి జూనియర్ ఏ మేరకు టార్గెట్ అందుకుంటాడా చూడాలి.