ఒక సినిమాకు ప్రి రిలీజ్ బజ్ రావాలంటే అందులో స్టార్లు ఉండాల్సిందే. ఏ బ్యాగ్రౌండ్ లేని కొత్త హీరో హీరోయిన్ నటించిన సినిమాకు హైప్ క్రియేట్ అయి.. అడ్వాన్స్ బుకింగ్స్ పెద్ద ఎత్తున జరగాలంటే అద్భుతాలు జరగాల్సిందే. ఎప్పుడో ఓ సినిమాకు కానీ ఇలా జరగదు. అందులోనూ హిందీలో ఇలాంటివి మరీ అరుదు. కానీ ‘సైయారా’ అనే కొత్త సినిమా ఈ అరుదైన ఫీటే సాధించింది. అహాన్ పాండే, అనీత్ పడ్డా అనే కొత్త హీరో హీరోయిన్ జంటగా నటించిన లవ్ స్టోరీ ఇది.
రాజ్, ‘ఆషిఖి-2’, ఏక్ విలన్ లాంటి హిట్ సినిమాలను అందించిన మోహిత్ సూరి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా మొదలైనపుడు ఎవరూ పట్టించుకోలేదు. కానీ మేకింగ్ మధ్యలో పాటలు వదిలిన దగ్గర్నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. టీజర్, ట్రైలర్ కూడా స్ట్రైకింగ్‌గా ఉండడంతో ఒక్కసారిగా సినిమాకు హైప్ పెరిగిపోయింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే జరిగాయి.
ఇక ఈ రోజు రిలీజైన ‘సైయారా’ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. రివ్యూయర్లందరూ 3.5, 4, 4.5 రేటింగ్స్ ఇస్తున్నారు. హిందీలో రివ్యూల పరంగా మార్కెటింగ్ మాయాజాలం జరుగుతుందనే విషయం వాస్తవమే అయినా.. ఈ సినిమాకు మంచి టాక్ కనిపిస్తోంది. ప్రేక్షకులు కూడా అంతే ఎగ్జైట్ అవుతున్నారు. చాలా పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.
కథ బలంగా ఉండడం.. లీడ్ పెయిర్ కెమిస్ట్రీ పండడం.. పాటలు, సినిమాటోగ్రఫీ బాగుండడం.. ఇలా చాలా పాజిటివ్స్ తోడైనట్లున్నాయి. దీంతో తొలి రోజు మేజర్ నార్త్ సిటీస్‌లో ప్యాక్డ్ హౌస్‌లతో నడిచేలా కనిపిస్తోంది ‘సైయారా’. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.100 కోట్ల వసూళ్లు సాధించడం కేక్ వాకే అని ట్రేడ్ పండిట్లు అంటున్నారు. అన్నీ కలిసొస్తే రూ.200 కోట్ల మార్కును కూడా టచ్ చేసే సత్తా ఉందట. మరి తెలుగు రాష్ట్రాల్లోని మల్టీప్లెక్స్ ప్రేక్షకులను కూడా ఆకర్షిస్తుందేమో వేచి చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates