కూలీ వదలబోతున్న బ్రహ్మాస్త్రం

అభిమానులే కాక సగటు ప్రేక్షకుల్లోనూ విపరీతమైన ఎగ్జైట్ మెంట్ కలిగిస్తున్న కూలి ప్రమోషన్ల పరంగా ఏ అవకాశాన్ని వదిలి పెట్టడం లేదు. ముఖ్యంగా తెలుగు మార్కెట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి వార్ 2కి మరింత టఫ్ కాంపిటీషన్ ఇచ్చేందుకు ఏం చేయాలో అంతా చేస్తోంది. అందులో భాగంగానే జూలై 22 హైదరాబాద్ లో సాంగ్ లాంచ్ ఈవెంట్ ఫిక్స్ చేసుకుంది. భాగ్యనగరంలో మొదటిసారి అనిరుధ్ రవిచందర్ లైవ్ కన్సర్ట్ చేయబోతున్నాడు. ముందస్తు అంచనాల ప్రకారం దీనికి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తరలి రాబోతున్నారు. వేడుక జరగబోతున్న క్వేక్ అరేనా సామర్ధ్యం కన్నా రెట్టింపు రావొచ్చని నిర్వాహకులు లెక్క వేస్తున్నారు.

ఇది బ్రహ్మాస్త్రం ఎందుకవుతుందంటే పబ్లిసిటీలో ఇప్పుడీ ఈవెంట్ చాలా కీలకం కానుంది. అనిరుద్ ప్రత్యక్షంగా ఇచ్చే వైబ్ మాములుగా ఉండదు. సాధారణంగా డబ్బింగ్ వెర్షన్లకు లైవ్  చేసేందుకు అతను ఒప్పుకోడు. కానీ రజనీకాంత్ సినిమా కావడం, యాభై కోట్ల డీలింగ్ తో తెలుగులో భారీ బిజినెస్ జరగడం లాంటి కారణాలు తనను మనసు మార్చుకునేందుకు ప్రేరేపించాయి. గతంలో దేవర కోసం నిర్మాత కళ్యాణ్ రామ్ చాలా ట్రై చేశాడు కానీ అనిరుద్ రాలేకపోయాడు. ఆ ఈవెంట్ వేరే రీజన్స్ వల్ల క్యాన్సిల్ కావడం ఇంకో కథ. అంతకు ముందు జెర్సీ, గ్యాంగ్ లీడర్, అజ్ఞాతవాసి వేటికీ కన్సర్ట్ చేయలేదు. అందుకే కూలి స్పెషల్ కానుంది.

ఒక్కో పాట ఒక్కో రూపంలో అంచనాలు అంతకంతా పెంచుకుంటూ పోతున్న నేపథ్యంలో సాంగ్స్ ఊహించినట్టే చార్ట్ బస్టర్ కావడం ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచెత్తుతోంది. ఇంకోవైపు కూలి మార్కెటింగ్ స్ట్రాటజీ వల్ల వార్ 2 ఇబ్బంది పడుతోంది. హైప్ పరంగా వెనుకబడి ఉండటం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తున్న మాట వాస్తవం. త్వరలో ట్రైలర్ తో సీన్ మార్చేస్తామనే ధీమా మేకర్స్ లో ఉంది కానీ వీలైనంత త్వరగా చేయమని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఆగస్ట్ 14 ఏపీ తెలంగాణలో తెల్లవారుఝామున బెనిఫిట్ షోలు వేసే ప్లానింగ్ జరుగుతోంది.