50 కోట్లు కాదు ఇంకా ఎక్కువే ఇవ్వొచ్చు

దర్శకుడు లోకేష్ కనగరాజ్ తాను కూలికి 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు ఓపెన్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మాములుగా స్టార్ డైరెక్టర్లు ఓపెన్ ప్లాట్ ఫార్మ్స్ మీద పారితోషికాల గురించి మాట్లాడరు. ఒకవేళ మీడియాలో ఏమైనా నెంబర్లు వచ్చినా మౌనంగా దాటేస్తారు తప్పించి ఔననో కాదనో చెప్పరు. కానీ లోకేష్ మాత్రం బాహాటంగా ఒప్పేసుకున్నాడు. అంతే కాదు లియో ఆరు వందల కోట్లు వసూలు చేసింది కాబట్టి ఇప్పుడు తాను తీసుకునే మొత్తాన్ని రెట్టింపు చేయడంలో తప్పేముందని అడిగాడు. మార్కెట్ డిమాండ్ ప్రకారమే తనకిస్తున్నారని వివరణ ఇచ్చాడు.

లోకేష్ చెప్పిందాంట్లో పూర్తి లాజిక్ ఉంది. ఎందుకంటే కూలికి ఇంత క్రేజ్ రావడానికి కారణం కేవలం రజనీకాంత్ ఒక్కరే కాదు. ఒకవేళ ఇదే సినిమా ఇదే టైటిల్ తో దర్శకుడు ఏ వెంకట్ ప్రభునో లేదా లింగుస్వామినో అయ్యుంటే పరిస్థితి ఎలా ఉండేది. ఖచ్చితంగా ఇప్పుడున్న హైప్ లో సగం మాత్రమే ఉండేది. ఎందుకంటే రజని పేరు మీదే బిజినెస్ జరగడం లేదు. జైలర్ మినహాయించి పెద్దన్న, పేట, కాలా, కబాలి, 2.0 మన దగ్గర ఏమయ్యాయో అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు లోకేష్ బ్రాండ్ తలైవర్ కు తోడవ్వడం వల్ల ఎక్కడ లేని అంచనాలు పెరిగిపోయి ప్రాజెక్టుకి అన్ని భాషల్లో క్రేజ్ వచ్చింది.

ఈ లెక్కన లోకేష్ కనగరాజ్ అమీర్ ఖాన్ తో చేయబోయే మూవీకి వంద కోట్లకు పైగా తీసుకున్నా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. కూలి బ్లాక్ బస్టర్ అయితే అంతకన్నా ఎక్కువ ఇచ్చినా షాకవ్వాల్సిన పని లేదు. రెండేళ్లు ఈ మూవీ కోసం కష్టపడిన లోకేష్ దీన్ని ప్యాన్ ఇండియాలో తీయాలనే తాపత్రయం చూపించకపోవడం మెచ్చుకోవాల్సిన విషయం. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మట్ లో తీసినా ఆటోమేటిక్ గా నేషనల్ లెవల్ మార్కెట్ వచ్చేసింది. ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న కూలికి తమిళనాడులో దాదాపు ప్రతి థియేటర్ రిలీజ్ రోజు షోలు వేయబోతున్నారు. వార్ 2 కాంపిటీషన్ వల్ల ఏపీ తెలంగాణలో పంపకాల లెక్కలు మారతాయి.