తెలుగువాడైన తమిళ హీరో విశాల్.. తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టాడు. మామూలుగా అయితే ఇది మనకు వార్తే కాదు. కానీ ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తోందంటే.. కొన్ని నెలల కిందటి పరిణామాలే కారణం. విశాల్ ఎన్నడూ లేని విధంగా తన కెరీర్లో చాలా రోజుల పాటు షూటింగ్‌లకు దూరంగా ఉన్నాడు. కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. తన చివరి చిత్రం ‘మదగజరాజా’ సంక్రాంతికి విడుదలై హిట్ అయింది. అది దశాబ్దం కిందటి సినిమా. రకరకాల కారణాలతో మరుగున పడిపోయిన ఆ సినిమాను.. ఉన్నట్లుండి రిలీజ్ చేశారు. అనూహ్యంగా దానికి మంచి స్పందన వచ్చింది.
ఐతే ఆ సినిమా ప్రమోషన్ల టైంలో విశాల్ అప్పీయరెన్స్ అందరికీ పెద్ద షాకిచ్చింది. ముఖం రూపు మారిపోయి, చేతులు వణుకుతూ తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న స్థితిలో కనిపించాడు విశాల్. అతడికి ఏమైందా అని అందరూ కంగారు పడ్డారు. కొన్ని రోజుల తర్వాత అతడిలో మార్పు వచ్చింది. కానీ మరి కొన్ని నెలల తర్వాత ఒక కార్యక్రమంలో స్పృహ తప్పి కింద పడిపోయి మళ్లీ అభిమానులను టెన్షన్ పెట్టాడు. దీంతో విశాల్ బాగానే ఉన్నాడా అనే సందేహాలు కలిగాయి. కొత్త సినిమా అనౌన్స్ చేయకపోవడంతో ఈ అనుమానాలు ఇంకా బలపడ్డాయి. ఐతే ఇటీవలే హీరోయిన్ ధనుష్కను పెళ్లాడబోతున్నట్లు శుభవార్త చెప్పిన విశాల్.. ఇప్పుడు తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టాడు.
ఈ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా విశాల్ నార్మల్‌గా, ఒకప్పట్లా ఫిట్‌గా కనిపించడం అభిమానులను సంతోషపెట్టింది. తన కొత్త సినిమాను లెజెండరీ ప్రొడ్యూసర్ ఆర్.బి.చౌదరి ప్రొడ్యూస్ చేస్తుండడం విశేషం. సూపర్ గుడ్ ఫిలిమ్స్‌లో ఇది 99వ చిత్రం. రవి అరసు అనే దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రంలో.. విశాల్ సరసన దుషారా విజయ్ కథానాయికగా నటిస్తోంది. విశాల్ మార్కు యాక్షన్ ఎంటర్టైనరేనట ఈ చిత్రం. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates