నాగార్జునని దాచాడు… సౌబిన్ పేలాడు

ఇటీవలే విడుదల చేసిన రజనీకాంత్ కూలిలో మౌనికా సాంగ్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఒక్క తెలుగు వెర్షనే మూడు మిలియన్ల వ్యూస్ దాటేయడం చూస్తే రీచ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. పూజా హెగ్డే రెడ్ కాస్ట్యూమ్ లో అంత అందంగా అదరగొడితే ఆమెకన్నా ఎక్కువ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సౌబిన్ సాహిర్ హైలైట్ కావడం ఊహించని ట్విస్టు. నలభై రెండేళ్ల సపోర్టింగ్ నటుడు ఈ స్థాయిలో డాన్స్ చేసి అదరగొడతాడని ఎవరూ అనుకోలేదు. ఇది చూసిన మలయాళం దర్శకులు ఇన్నేళ్లు సౌబిన్ లోని ఈ కోణాన్ని వాడుకోనందుకు తెగ ఫీలవుతున్నారట. అయితే చెప్పుకోవాల్సిన అసలు ట్విస్టు మరొకటి ఉంది.

ఈ మౌనికాలో ప్రధానంగా కనిపించాల్సింది కింగ్ నాగార్జున. ఆయన కోసమే పూజా హెగ్డే పోర్టుకు వచ్చినప్పుడు సెలబ్రేషన్ గా ఈ ఐటెం సాంగ్ ఆడిస్తారు. అయితే దాన్ని లిరికల్ వీడియోలోనే చూపిస్తే థ్రిల్ ఉండదని భావించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఎంత సీక్రెట్ గా ఉంచాలని ట్రై చేసినా లీకైపోయింది. రజనీకాంత్ ఉండకపోవచ్చని టాక్. నెగటివ్ రోల్ అయినప్పటికీ నాగ్ పాత్రకు కూలిలో చాలా ప్రాధాన్యం ఉంటుంది. దానికి తగ్గట్టే ఒక ప్రత్యేక పాటను ఉంచారు. ఎక్స్ పెక్ట్ చేసిన దాని కన్నా చాలా పెద్ద రెస్పాన్స్ రావడం చూసి కూలి బృందం ఆనందం మాములుగా లేదట.

ఇంకో రెండు పాటలు రావాల్సి ఉందని చెన్నై టాక్. అనిరుద్ రవిచందర్ ఈ ఆల్బమ్ మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడు. మరీ ఎక్స్ ట్రాడినరి ట్యూన్స్ గా మొదట అనిపించకపోయినా మెల్లగా ఎక్కుతున్న వైనం ట్రెండ్స్ లో కనిపిస్తోంది. ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న కూలికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ల కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. బిగ్ స్క్రీన్ కన్నా ముందు పబ్లిక్ స్టేజి మీద రజని, నాగ్, ఉపేంద్ర, అమీర్ ఖాన్లను చూడాలని తెగ ఆరాటపడుతున్నారు. అన్నట్టు ఈసారి లైవ్ షోలో సౌబిన్ సాహిర్ డాన్స్ చేస్తే అదిరిపోతుంది కదూ. ప్రస్తుతం టీమ్ మనసులో ఆ ఐడియా అయితే పుట్టిందట. చేసేలానే ఉన్నారు.