పవన్‌తో కచ్చితంగా సినిమా చేస్తా – మెహర్ రమేష్

మెహర్ రమేష్.. ఈ పేరు చెబితే చాలు, కొందరు స్టార్ హీరోల అభిమానులు, అలాగే నిర్మాతల గుండెలు గుబేల్‌మంటాయి. జూనియర్ ఎన్టీఆర్‌తో ‘శక్తి’ లాంటి ఆల్ టైం డిజాస్టర్ ఇచ్చి ఆ హీరో అభిమానులకు తీరని వేదన మిగిల్చిన దర్శకుడాయన. దాని తర్వాత విక్టరీ వెంకటేష్‌తో ‘షాడో’ తీసి ఆయన కెరీర్లోనే అట్టడుగు స్థాయిలో నిలిచే సినిమాను అందించాడు. ఆ తర్వాత కెరీర్లో చాలా గ్యాపే వచ్చింది. ఇక దర్శకుడిగా మళ్లీ సినిమా తీయడని అనుకుంటే.. మెగాస్టార్ చిరంజీవితో ‘వేదాళం’ సినిమాను ‘భోళా శంకర్’ పేరుతో రీమేక్ చేసి.. ఇంకో అల్ట్రా డిజాస్టర్ ఇచ్చాడు మెహర్. ఈ దెబ్బతో మళ్లీ మెహర్‌తో ఇంకే స్టార్ హీరో సినిమా చేయడనే అనుకుంటున్నారంతా.

కానీ మెహర్ మాత్రం ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తానని ధీమాగా చెబుతుండడం విశేషం. ఈ మధ్యే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఒకటికి రెండుసార్లు ఈ విషయాన్ని నొక్కి వక్కాణించడం విశేషం. మెగా కుటుంబానికి మెహర్ రమేష్ బంధువు, అత్యంత సన్నిహితుడు అన్న సంగతి తెలిసిందే. ఈ సాన్నిహిత్యంతోనే తన ట్రాక్ రికార్డు ఎల ా ఉన్నప్పటికీ.. మెగాస్టార్ చిరంజీవితో ‘భోళా శంకర్’ తీశారు. ఈ సినిమాతో చిరుకు అవమాన భారం తప్పలేదు. అయినా మెహర్.. ఇప్పుడు చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తానంటున్నాడు.

ఓ ఇంటర్వ్యూలో పెద్దన్నతో చేశారు, చిన్నన్నతో సినిమా ఎప్పుడు అని అడిగితే.. ‘‘కచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో నేను సినిమా చేస్తా. సమస్యే లేదు’’ అని మెహర్ అన్నాడు. ఇంత కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు అంటే.. సినిమా ఫిక్సయిపోయిందా ఏంటి అని అడిగితే.. ‘‘నేను ఫిక్సయ్యా. చిరంజీవి గారితో సినిమా చేయాలనుకున్నాను. చేశాను. పవన్ కళ్యాణ్ గారితో 100 పర్సంట్ సినిమా చేస్తా’’ అని ధీమాగా చెప్పాడు మెహర్. ఈ మాట పవన్ అభిమానులను ఒకింత కంగారెత్తిస్తున్నప్పటికీ.. పవన్ రాజకీయంగా ఇప్పుడున్న బిజీలో కొత్త సినిమాలేవీ ఒప్పుకోరనే ధీమాతో మెహర్‌తో ఆయన సినిమా ఉండదనే అనుకుంటున్నారు.