కోట శ్రీనివాసరావు టాప్ 10 సినిమాలు

ఏడు వందలకు పైగా సినిమాల్లో నటించిన నట దిగ్గజం కెరీర్ లో టాప్ 10 తీసుకోవడం దుర్లభమే అయినా కోట శ్రీనివాసరావు అభిమానులు గర్వంగా చెప్పుకునే, ఎప్పటికీ నిలిచిపోయే కొన్ని గొప్ప పాత్రల గురించి తలుచుకోవడం విషాదం అలుముకున్న ఈ సమయంలో కొంత స్వాంతన చేకూరుస్తుంది. ముదిమి వయసులోనూ నటనే ఊపిరిగా బ్రతికిన కోట మరణాన్ని సన్నిహితులు, ఇండస్ట్రీ వర్గాలే కాదు ప్రేక్షకులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఆణిముత్యాల్లాంటి  కొన్ని మచ్చుతునకలు గుర్తు చేసుకుందాం

1. అహ నా పెళ్ళంట  

కామెడీలో కొత్త ఒరవడి సృష్టించిన పిసినారిగా కోట ఇందులో పోషించిన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. జంధ్యాల సృష్టించిన ఈ క్లాసిక్ లో బ్రహ్మానందంని వేధిస్తూ కోట శ్రీనివాసరావు పండించిన హాస్యం జనాన్ని ఊపేసింది. కమర్షియల్ మూసలో ఉన్న టాలీవుడ్ కు కొత్త ఊపిరి పోసిన ఈ ట్రెండ్ సెట్టర్ ద్వారా కోటలోని సరికొత్త యాంగిల్ బయట పడి ఇలాంటి క్యారెక్టర్లు రాసుకునేందుకు ప్రేరణ ఇచ్చింది

2. గణేష్

వెంకటేష్ హీరోగా తిరుపతిస్వామి దర్శకత్వంలో వచ్చిన గణేష్ లో హెల్త్ మినిస్టర్ గా కోట విలనీ చూసి భయపడని ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. అందుకే నంది అవార్డు సైతం వెతుక్కుంటూ వచ్చింది. క్లైమాక్స్ లో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఆయన చూపించిన పెర్ఫార్మన్స్ గురించి వర్ణించాలంటే మాటలు చాలవు. కొన్ని సీన్లలో ఏకంగా వెంకటేష్ ని డామినేట్ చేసే స్థాయిలో పండించారు.

3. ఆ నలుగురు

రెండున్నర గంటల సినిమాలో క్లైమాక్స్ ముందు వరకు ఆడియన్స్ కోటని తిట్టుకుంటూనే ఉంటారు. వడ్డీ వ్యాపారిగా జనాల రక్తం తాగే పాత్రలో ఆయన నటన గురించి చెప్పేందుకు పదాలు చాలవు. అయితే స్మశానంలో జరిగే చివరి ఎపిసోడ్ లో రాజేంద్రప్రసాద్ కొడుకులను నిలదీసి జనంలో కనువిప్పు కలిగించే తీరుకి చప్పట్లు కొట్టకుండా ఉండలేం. అప్పటిదాకా తిట్లు తిన్న కోట చివర్లో కన్నీళ్లు పెట్టించడం నభూతో నభవిష్యత్

4. శత్రువు

థాంక్స్, ఈ ఫోన్ ఎవరు కనిపెట్టాడ్రా బాబు అంటూ వెరైటీ మ్యానరిజంతో శత్రువులో కోట చూపించిన విలనీ విమర్శకులను సైతం శబాష్ అనేలా చేసింది. రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్న రావుగోపాల్ రావు స్థానాన్ని భర్తీ చేయగలిగిన సత్తా ఈయనకే ఉందని మీడియా మెచ్చుకుంది. కేకలు పెట్టకుండా నవ్వుతూనే మర్డర్లు చేయించే కోట బాడీ లాంగ్వేజ్ ఒకరంగా ఇప్పుడొచ్చే నటులకు ఒక రెఫెరెన్స్ లాంటిది. వెంకీ కన్నా ఎక్కువగా కోటనే ఇష్టపడినా ఆశ్చర్యం లేదు

5. గాయం  

హైదరాబాద్ నగరంలో దందాలు చేసే గూండా కం పొలిటీషియన్ గా తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతూ కోటశ్రీనివాసరావు పండించిన విలనీ ఓ రేంజ్ లో పేలింది. జగపతిబాబు లాంటి పవర్ ఫుల్ క్యారెక్టరైజేషన్ కి ధీటుగా రామ్ గోపాల్ వర్మ డిజైన్ చేసిన పాత్రను కోట అంచనాలను మించి మెప్పించడం మరోసారి నంది అవార్డు వచ్చేలా చేసింది. థియేటర్ నుంచి బయటికి వచ్చిన ఆడియన్స్ ఈయన గురించే ఎక్కువ మాట్లాడుకోవడం అబద్దం కాదు.

6. ఆమె

డబ్బు కోసం ఎంతకైనా కక్కుర్తి పడి మొదట్లో పాజిటివ్ గా మొదలై చివరికి అదే సొమ్ము కోసం కోడలి మీదే కన్నేసే కిరాతకమైన మామ పాత్రలో కోట వేరియేషన్స్ గురించి చెప్పాలంటే పేజీలు సరిపోవు. ఒకవైపు కామెడీ చేస్తూనే ఇంకోవైపు కూల్ విలనిజం పండించిన వైనం చూస్తే వాహ్ అనకుండా ఉండలేం. శ్రీకాంత్, నరేష్, ఊహ, తనికెళ్ళ భరణి, చంద్రమోహన్, సంగీత లాంటి ఎందరు టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నా కోటనే హైలైట్ కావడం చిన్న విషయం కాదు

7. మామగారు

స్వంత ఇంట్లో కుటుంబ సభ్యుల ఆదరణ పోగొట్టుకుని, చేదు అలవాట్లతో బిచ్చగాడితో స్నేహం చేసే పాత్ర కోట శ్రీనివాసరావు వర్సటాలిటీలో మరో కోణం మామగారు. విలనిజం లేకపోయినా అందరితో తిట్లు తినే వెరైటీ క్యారెక్టరైజేషన్ ని నిలబెట్టిన తీరు ప్రత్యేకంగా ఉంటుంది. స్క్రీన్ మీద దాసరి నారాయణరావు లాంటి దిగ్గజం ఎంత డామినేట్ చేస్తున్నా సరే తన ఉనికిని చాటుకోవడంలో కోటగారి శైలి దాన్ని ఎవర్ గ్రీన్ గా మార్చేసింది.

8. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే

ఉద్యోగం లేక బేవార్స్ గా తిరిగే కొడుకుని పోషించే తండ్రిగా కోట చూపించిన నటనను ఇంకెవరైనా చేయగలరా అంటే సమాధానం నో అనే వస్తుంది. సినిమా మొదలైన గంటకే ఆ పాత్ర చనిపోయినా దాని తాలూకు ప్రభావం ఎంత బలంగా ఉందంటే ఇప్పటికీ సోషల్ మీడియా ట్రెండ్స్ లో ఆ వీడియోలు వాడుతూన్న వైనం కనిపిస్తూనే ఉంటుంది. వెంకటేష్ కాంబోలో ఆయన సన్నివేశాలు ఫాదర్ సన్ బాండింగ్ ని కొత్త రీతిలో పరిచయం చేశాయి

9. హలో బ్రదర్

బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడుతూ తన కింద కానిస్టేబుల్ తో చీవాట్లు తినే ఎస్ఐ తాడి మట్టయ్యగా కోట చూపించిన వైవిధ్యం ఒకపక్క నవ్విస్తూనే  ఇంకో పక్క భావోద్వేగాలను రగులుస్తుంది. నాగార్జున, బ్రహ్మానందం కాంబో సీన్లలో ఆయన పండించిన కామెడీ మాములుగా ఉండదు. చివరిలో మల్లికార్జునరావు చనిపోయాక జైల్లో అతన్ని లేపాలని ప్రయత్నిస్తూ మనల్ని ఏడిపించడం కోటకు మాత్రమే చెల్లింది. ఈయన్ని గొప్పగా వాడుకున్న దర్శకుల్లో ఈవివి సత్యనారాయణ ఒకరు

10. కన్యాదానం

కొడుకు ప్రేమించిన అమ్మాయి దూరమైతే ఆమెను దగ్గర చేయాలని తాపత్రయపడే మధ్యతరగతి తండ్రిగా కోట చూపించే నటన జనాలకు బాగా దగ్గరయ్యింది. త్యాగం, స్వార్థం, మంచితనం ఇలా అన్ని షేడ్స్ కలగలసిన పాత్రను నిలబెట్టడం అంత సులభం కాదు. కానీ కోట శ్రీనివాసరావు దాన్ని అలవోకగా చేసేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే వంద సినిమాలకు పైగానే కోట బెస్ట్ వస్తూనే ఉంటాయి. భౌతికంగా ఆయన దూరమైనా సినిమాల రూపంలో ఆయన ఎప్పటికీ నిత్యజీవే.