దేవా క‌ట్టా.. సెన్సేష‌న‌ల్ వెబ్ సిరీస్‌

చేసిన‌వి త‌క్కువ సినిమాలే అయినా.. ద‌ర్శ‌కుడిగా మంచి పేరే సంపాదించాడు దేవా క‌ట్టా. వెన్నెల లాంటి ఫ‌న్ ఎంట‌ర్టైన‌ర్‌తో ద‌ర్శ‌కుడిగా అరంగేట్రంలోనే హిట్ కొట్టిన దేవాకు ఆ త‌ర్వాత ఆశించిన క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌లు ద‌క్క‌లేదు. కానీ ప్ర‌స్థానం, రిప‌బ్లిక్ లాంటి సినిమాలు ద‌ర్శ‌కుడిగా త‌న‌కు గొప్ప పేరే తెచ్చిపెట్టాయి. రిప‌బ్లిక్ క‌మ‌ర్షియ‌ల్‌గా ఆడ‌క‌పోవ‌డం దేవాను బాగానే నిరాశ‌ప‌రిచిన‌ట్లు క‌నిపించింది. దీని త‌ర్వాత ఆయ‌న ఫీచ‌ర్ ఫిలిం చేయ‌కుండా డిజిట‌ల్ బాట ప‌ట్టాడు. మ‌య‌స‌భ అనే వెబ్ సిరీస్ చేశాడు. సోనీ లివ్ కోసం చేసిన ఈ సిరీస్ వ‌చ్చే నెల తొలి వారంలో స్ట్రీమింగ్‌కు రాబోతోంది. 

ఈ నేప‌థ్యంలో తాజాగా టీజ‌ర్ లాంచ్ చేశారు. అది చాలా స్ట్రైకింగ్‌గా ఉండి సోష‌ల్ మీడియాలో ఆల్రెడీ ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. ఇది ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌ను మ‌లుపు తిప్పిన ఇద్ద‌రు రాజ‌కీయ ఉద్ధండుల పాత్ర‌ల స్ఫూర్తితో తీసిన సిరీస్ కావ‌డం విశేషం. ఆ ఇద్ద‌రే.. నారా చంద్ర‌బాబు నాయుడు, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి. ఈ సిరీస్‌లో వీళ్లిద్ద‌రి పాత్ర‌ల‌ను పోలిన క్యారెక్ట‌ర్ల‌ను ఆది పినిశెట్టి, చైత‌న్య‌రావు చేశారు. సూటిగా చంద్ర‌బాబు, వైఎస్‌ల పేర్లు పెట్ట‌కుండా నాయుడు, రెడ్డి అనే పేర్ల‌తో చూపించారు ఈ పాత్ర‌ల‌ను. అలాగే ఎన్టీఆర్, ల‌క్ష్మీపార్వ‌తిల పాత్ర‌లను కూడా ప‌రోక్షంగా చూపించారు. 

త‌న రాజ‌కీయ జీవితం ఒక మేక‌ప్ ఆర్టిస్టు చెప్పుల కింద నలిగిపోయే ప‌రిస్థితి వ‌చ్చిందంటూ నాయుడు పాత్ర చెప్పే డైలాగ్‌తో ఈ సిరీస్ టీజ‌ర్ మొద‌లైంది. ఇప్పుడు నువ్వు ఏమైనా చేస్తే అది ఎప్ప‌టికీ నాకు వెన్నుపోటు అనే ఆయుధంగా మారుతుంది అని నాయుడితో రెడ్డి చెప్పే డైలాగ్ కూడా క్యూరియాసిటీ పెంచేదే. ఇలా ఒక‌ప్పుడు ఉమ్మ‌డి ఏపీ చ‌రిత్ర‌ను మ‌లుపు తిప్పిన రాజ‌కీయ ప‌రిణామాల చుట్టూ దేవా క‌ట్టా ఈ సిరీస్‌ను ఇంట్రెస్టింగ్‌గా నడిపించిన‌ట్లున్నాడు. బాబు, వైఎస్‌ల ఒక‌ప్ప‌టి స్నేహాన్ని.. ఆ త‌ర్వాతి రాజ‌కీయ వైరాన్ని ఇందులో చూపించిన‌ట్లున్నారు. దీని మీద మున్ముందు వివాదాలు చెల‌రేగినా ఆశ్చ‌ర్యం లేదు. ఇప్ప‌టికైతే జ‌నాల దృష్టిని ఈ టీజ‌ర్ బాగానే ఆక‌ర్షిస్తోంది.