మౌనికా మాస్… అసాధ్యుడివయ్యా లోకేష్

కూలీ నుంచి ఇంకో లిరికల్ వీడియో వచ్చేసింది. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ ని లాంచ్ చేశారు. విచిత్రంగా ఇందులో రజనీకాంత్, నాగార్జున కనిపించలేదు. మలయాళ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సౌభిన్ షాహిర్ తెగ హుషారుగా డాన్సు చేయడం ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేసింది. షిప్ యార్డ్ లో మౌనికా అంటూ సాగే ఈ పాటకు అనిరుద్ రవిచందర్ ఎప్పటిలాగే క్రేజీ ట్యూన్ కంపోజ్ చేశాడు. వినగానే అర్థం కాకపోయినా మెల్లగా వినేకొద్దీ స్లో పాయిజన్ లా ఆకట్టుకుంటోంది. మెయిన్ క్యాస్టింగ్ లేకుండా పూజా హెగ్డే లాంటి టాప్ హీరోయిన్ ని పెట్టుకుని ఇలా చిత్రీకరించడం ఒక్క లోకేష్ కనగరాజ్ వల్లే సాధ్యమవుతుందేమో.

మౌనికా సాంగ్ ఛార్ట్ బస్టర్ కావడం ఖాయం. అసలైన వీడియో కంటెంట్ దాచుకుని ఇలా పాటలతో హైప్ ఎక్కించడంలో లోకేష్, అనిరుద్ లు వంద శాతం మార్కులు కొట్టేస్తున్నారు. ఒకపక్క వార్ 2 నుంచి ఒక్క సాంగ్ బయటికి రాలేదు. టీజర్ తప్ప ఇప్పటిదాకా ఎలాంటి పబ్లిసిటీ చేయలేదు. కానీ పోటీలో ఉన్న కూలి మాత్రం ఇలా బజ్ విషయంలో దూసుకుపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. హార్బర్ కూలిగా రజినీకాంత్ నటిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో నాగార్జున విలన్ గా నటిస్తుండగా ఉపేంద్ర, అమీర్ ఖాన్ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు.

చెన్నై మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు కూలి ట్రైలర్ లేకుండానే డైరెక్ట్ గా థియేటర్ రిలీజ్ జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దానికి సరిపడా బజ్ క్రమంగా ఏర్పడుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశ పనుల్లో ఉన్న కూలి జూలై నెలాఖరుకి బీజీఎమ్ తో సహా ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకోబోతోంది. క్వాలిటీ విషయంలో రాజీ పడని లోకేష్ కనగరాజ్ ఈ ప్రాజెక్టు మీద రెండేళ్లుగా వర్క్ చేస్తున్నాడు. రజినీకాంత్ తక్కువ డేట్లతో వేగంగా పూర్తి చేసినప్పటికీ నిర్మాణాంతర కార్యక్రమాలకు ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. తమిళనాడు నుంచి మొదటి వెయ్యి కోట్ల గ్రాసర్ అవుతుందని కోలీవుడ్ ఫ్యాన్స్ గంపెడంత ఆశలతో ఎదురు కూస్తున్నారు.