సాహో ఎంత పని చేసిందో పాపం!

‘రన్‍ రాజా రన్‍’ సినిమా చూసి తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్తగా థింక్‍ చేసే మరో కొత్త టాలెంట్‍ వచ్చిందని సుజీత్‍ గురించి గొప్పగా చెప్పుకున్నారు. అతడి ఆలోచనలు నచ్చి వెంటనే ప్రభాస్‍ తనతో సినిమా చేస్తానని కమిట్‍ అయ్యాడు. ఒక మాదిరి బడ్జెట్‍లో అనుకున్న ఆ సినిమా కాస్తా ‘బాహుబలి’ తర్వాత భారీ సినిమా అయిపోయింది. అనుభవలేమితో సుజీత్‍ ‘సాహో’ భారాన్ని మోయలేక ఇబ్బందులు పడ్డాడు.

అతడిని మళ్లీ ‘రన్‍ రాజా రన్‍’ లాంటి ఐడియాలతో సినిమా చేయమని అడగవచ్చు. కానీ ప్రభాస్‍తో చేసిన తర్వాత మళ్లీ అగ్ర హీరోతోనే చేయాలని అతడు భావిస్తున్నాడు. అందుకే చరణ్‍ని ఒప్పించడానికి ప్రయత్నించి ‘లూసిఫర్‍’ రీమేక్‍కి కన్సిడరేషన్‍లోకి వెళ్లాడు. కానీ సుజీత్‍ చేసిన మార్పులు చిరంజీవికి అంతగా నచ్చకపోవడంతో సుజీత్‍ ఆ రీమేక్‍ వదిలేసుకున్నాడు.

ఇప్పుడు మరోసారి అతడిని వెతుక్కుంటూ ఒక రీమేక్‍ సినిమానే వచ్చిందట. ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్‍ చేయాలని బెల్లంకొండ శ్రీనివాస్‍ ఉవ్విళ్లూరుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకుడెవరైతే బాగుంటుందనే డిస్కషన్‍లో సుజీత్‍ పేరు వచ్చిందట. ప్రస్తుతం అవకాశాలు లేవు కాబట్టి అతను ఈ రీమేక్‍ చేయడానికి ఓకే చెప్తాడో లేక ఒరిజినల్‍ ఐడియాతోనే చేద్దామని వెయిట్‍ చేస్తాడో చూడాలిక.