అనాథగా పవన్ కళ్యాణ్

రెండేళ్ల కిందట ‘బ్రో’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందులో ఆయనది అతిథి పాత్ర. ఆ సినిమా అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో దాని గురించి పెద్దగా డిస్కషనే లేకపోయింది. పవన్ హీరోగా నటించిన సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణకు తెరదించుతూ ‘హరిహర వీరమల్లు’ సినిమా ఈ నెల 24న థియేటర్లలోకి రాబోతోంది.

ఇంతకుముందు మూడుసార్లు సినిమా వాయిదా పడ్డ నేపథ్యంలో ఈసారైనా రిలీజవుతుందా లేదా అన్న సందేహాలున్నాయి కానీ.. నిర్మాత ఏఎం రత్నం మాత్రం 24న పక్కా అని అంటున్నారు. ఆయనే ముందుండి సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి ఆసక్తికర విశేషాలు పంచుకుంటున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రత్నం.. ‘హరిహర వీరమల్లు’లో పవన్ పాత్ర గురించి మాట్లాడారు.

ఈ చిత్రంలో పవన్‌ అనాథగా కనిపిస్తాడని రత్నం వెల్లడించారు. వరదల్లో కొట్టుకుపోతున్న చిన్న బిడ్డను కాపాడి ఒక గుడిలో పెంచితే.. అతను సనాతన ధర్మ పరిరక్షకుడిగా మారతాడని రత్నం తెలిపారు. ఔరంగజేబు నుంచి సనాతన ధర్మానికి ముప్పు వాటిల్లిన పరిస్థితుల్లో.. అతడికి వ్యతిరేకంగా పోరాడే యోధుడి పాత్రలో పవన్ కనిపిస్తాడని రత్నం చెప్పారు. విష్ణువు, శివుడి పాత్రల కలయికగా వీరమల్లు క్యారెక్టర్ ఉంటుందని.. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో పాటించే అనేక విషయాలను సినిమాలోనూ చూపించామని ఆయన తెలిపారు. 

ఐతే పవన్ పాత్ర చరిత్రలో దేన్నీ పోలి ఉండదని.. ఇది పూర్తిగా కల్పిత పాత్ర, కథ అని రత్నం స్పష్టం చేశారు. పవన్ రియల్ లైఫ్ ఇమేజ్‌ను గుర్తు చేస్తూ.. దాన్ని ఇంకా ఎలివేట్ చేసేలా వీరమల్లు పాత్ర ఉంటుందని ఆయనన్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా.. మధ్యలో రత్నం తనయుడు జ్యోతికృష్ణ చేతుల్లోకి వెళ్లింది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా.. బాబీ డియోల్ ఔరంగజేబుగా విలన్ పాత్ర పోషించాడు.