అల్లు అర్జున్ 22 – హాలీవుడ్ విలన్ వేట

అంతర్జాతీయ ప్రమాణాలతో అల్లు అర్జున్, అట్లీ కలయికలో రూపొందుతున్న భారీ విజువల్ గ్రాండియర్ షూటింగ్ ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. కొన్ని కీలక సన్నివేశాలు ఆల్రెడీ పూర్తయిపోయాయి. అధిక శాతం చిత్రీకరణ ఇప్పటిదాకా ముంబైలో జరిగింది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తీస్తున్న ఏఏ 22లో దీపికా పదుకునే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటించడం ఫిక్స్ అయిపోయింది. జాన్వీ కపూర్ ప్రకటన త్వరలోనే రావోచ్చట. వీళ్ళు కాకుండా పుష్ప జోడి రష్మిక మందన్న సైతం ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో భాగం కాబోతున్నట్టు తెలిసింది. కీలకమైన విలన్ పాత్ర కోసం హాలీవుడ్ నటులను చూస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్

రెండు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒకరు విల్ స్మిత్, మరొకరు డ్వెన్ జాన్సన్. వినడానికి బాగానే ఉంది కానీ వీళ్ళు అంత సులభంగా దొరకరు. పైగా రెమ్యునరేషన్ భారీగా ఛార్జ్ చేస్తారు. ప్రొడక్షన్ విషయంలో రాజీ పడకూడదనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నప్పటికీ యాక్టర్ల పారితోషికాలు మరీ చుక్కలు దాటిపోతే ఇబ్బందే. పైగా వాళ్ళ డేట్లు తీసుకుని రానూపోనూ విమాన ప్రయాణ ఖర్చులు భరించి మైంటైన్ చేయడం పెద్ద ప్రహసనం. స్పిరిట్ లో డాన్లీని దాదాపుగా లాక్ చేసుకున్న సందీప్ రెడ్డి వంగాని స్ఫూర్తిగా తీసుకుని అట్లీ ఇలా ప్లాన్ చేసుకున్నాడని చెప్పలేం కానీ సబ్జెక్టు అలా డిమాండ్ చేస్తోందట.

ఎంత పెద్ద బడ్జెట్ అయినా అనుకున్న టైంలో సినిమా పూర్తి చేయడంలో అట్లీ ఎక్స్ పర్ట్. ఇప్పుడు కూడా అదే కమిట్ మెంట్ తో పని చేస్తున్నాడని తెలిసింది. విఎఫెక్స్ కోసం పలు ఇంటర్నేషనల్ కంపెనీలు పని చేస్తున్న నేపథ్యంలో చివరి నిమిషం వరకు ఒత్తిడి తెచ్చుకోకుండా కంటెంట్ ని త్వరగా సిద్ధం చేసేలా బన్నీ, అట్లీ పరస్పరం సహకరించుకుంటున్నారని వినికిడి. 2027 సంక్రాంతి విడుదలను ప్రాధమికంగా టార్గెట్ చేసుకున్న ఏఏ 22 వీలైతే వచ్చే ఏడాది దీపావళి లేదా డిసెంబర్ ఆప్షన్లు కూడా పెట్టుకుందట. ఇక్కడ చెప్పినవే కాకుండా క్యాస్టింగ్ కు సంబంధించిన చాలా సర్ప్రైజులు రాబోతున్నాయని అంటున్నారు.