విశ్వంభరకు సంబంధించి కేవలం ఒక్క ఐటెం సాంగ్ మాత్రమే బాలన్స్ ఉంది. మౌని రాయ్ ని తీసుకున్నట్టు సమాచారముంది కానీ ఇంకా యూనిట్ అధికారికంగా ధృవీకరించలేదు. ఈ పాటను కీరవాణికు బదులు భీమ్స్ సిసిరోలీయోతో కంపోజ్ చేయిస్తున్న సంగతి తెలిసిందే. కాకపోతే ఫ్రెష్ ట్యూన్ కి బదులు మెగాస్టార్ ఐకానిక్ సాంగ్స్ లో ఒకటైన ‘ఆట కావాలా పాట కావాలా’ని రీమిక్స్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటిదాకా చిరంజీవి తన పాత పాటలను తనే వాడుకోవడం జరగలేదు. రామ్ చరణ్ నాయక్ – రచ్చలో గ్యాంగ్ లీడర్, కొండవీటి దొంగను రీమిక్స్ చేశారు కానీ చిరు ఈ ప్రయోగానికి దూరంగా ఉంటూ వచ్చారు.
ఇక్కడ రిస్క్ అనేందుకు కారణముంది. అన్నయ్య 2000 సంవత్సరంలో వచ్చింది. అంటే సరిగ్గా పాతిక సంవత్సరాలు గడిచిపోయాయి. చిరంజీవి, సిమ్రాన్ ఊర మాస్ స్టెప్పులకు థియేటర్లు హోరెత్తిపోయాయి. ఎప్పుడు శాటిలైట్ ఛానల్స్ లో వచ్చినా యూట్యూబ్ లో చూసినా ఈ పాట నుంచి చూపు తిప్పుకోవడం కష్టం. ఒకరకంగా చెప్పాలంటే అన్నయ్య సక్సెస్ లో ఈ సాంగ్ పోషించిన పాత్ర చిన్నది కాదు. చిరు ఎంత ఆకర్షణీయంగా నిలిచారో సిమ్రాన్ తన గ్లామర్ తో అంతే గొప్పగా అదరగొట్టింది. ఇప్పుడా మేజిక్ ని రిపీట్ చేయాలి. లేదంటే సోషల్ మీడియాలో పోలికలు తీసుకొచ్చి మరీ ఆన్ లైన్ జనాలు ఏకేస్తారు.
అసలే విశ్వంభర తగినంత బజ్ లేక పోరాడుతోంది. గత ఏడాది ఆగస్ట్ లో వచ్చిన టీజర్ తర్వాత మళ్ళీ ఎలాంటి వీడియో కంటెంట్ వదల్లేదు. సంక్రాంతికి రిలీజ్ అనుకుంటే ఏడు నెలలు దాటినా కనీసం కొత్త విడుదల తేదీని ఇప్పటిదాకా ప్రకటించలేదు. పైగా మెగా 157 శరవేగంగా పూర్తి చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇంత నెగటివ్ వాతావరణంలో ఆటా కావాలా పాట కావాలాని ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టు తెరకెక్కించడం వశిష్టకు సవాలే. మణిశర్మ ఊరమస్ కంపోజింగ్ కి భీమ్స్ ఎలాంటి న్యాయం చేస్తాడో వేచి చూడాలి. కొత్త ట్యూన్ కి సరిపడా టైం లేకపోవడం వల్లే ఆట కావాలా పాట కావాలాకు ఓటేసినట్టు ఇన్ సైడ్ టాక్.
Gulte Telugu Telugu Political and Movie News Updates