నో ట్రైలర్… షాక్ ఇవ్వనున్న కూలీ ?

ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న కూలి మీద అంచనాల గురించి మళ్ళీ చెప్పడానికేం లేదు. తమిళనాడు హిస్టరీలోనే అత్యంత పెద్ద ఓపెనింగ్ వస్తుందనే నమ్మకంతో బయ్యర్లు ఎగబడి కొంటున్నారని చెన్నై టాక్. పోటీలో వార్ 2 ఉన్నప్పటికీ రజనీకాంత్ మేనియా ముందు ఎవరైనా నిలవడం కష్టమేనని ఫ్యాన్స్ అభిప్రాయం. కోలీవుడ్ వెయ్యి కోట్ల కలను సాధ్యం చేయబోయే మొదటి సినిమాగా దీని మీద మాములు బజ్ లేదు. అయితే నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అభిమానులకు ఒక షాక్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుందని ఇన్ సైడ్ రిపోర్ట్. దాని ప్రకారం కూలి నుంచి ఎలాంటి టీజర్, ట్రైలర్ కానీ రావట. నేరుగా థియేటర్లలోనే చూడాలి.

ప్రస్తుతం ఈ డెసిషన్ గురించి దర్శకుడు లోకేష్ కనగరాజ్ బృందం తర్జనభర్జనలు పడుతోందని సమాచారం. రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి కాంబో చేతిలో ఉన్నప్పుడు ఎలాంటి వీడియో ప్రమోషన్ అవసరం లేదనేది సన్ అధినేతల అభిప్రాయమట. కానీ ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ట్రైలర్ భోజనానికి ముందు పెట్టే సలాడ్ లాంటిది. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఇది చాలా కీలకం. కానీ కూలికి అలా చేయాలని అనుకోవడం వెనుక ఆలోచన ఎవరిదో కానీ ఒకవేళ నిజమైతే మాత్రం రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ హైప్ ఎక్కడికో వెళ్ళిపోతుంది.

దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాలి. జూలై నెలాఖరున చెన్నై నెహ్రు స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. ఒకవేళ అక్కడ లాంచ్ చేస్తే సరే. లేదంటే ఇంక రాదనే అనుకోవాలి. ఆగస్ట్ 7 హైదరాబాద్ లో మరో వేడుక ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే కూలికి ట్రైలర్ వదలకపోయినా బజ్ తగ్గదు సరికదా ఇంకా పెరుగుతుంది. గతంలో గీత గోవిందం లాంటి కొన్ని తెలుగు సినిమాలకు ఈ స్ట్రాటజీ వాడి సక్సెసయ్యారు. రజని రేంజ్ హీరోలకు ఎప్పుడూ జరగలేదు. కానీ బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ఖచ్చితంగా ట్రైలర్ కావాలని డిమాండ్ చేస్తున్నారట.