రామాయణ ఖాతాలో 1000 కోట్ల లాభం

విడుదలకు ఇంకా ఏడాదికి పైగా టైం ఉండగానే బాలీవుడ్ విజువల్ గ్రాండియర్ రామాయణ సంచలనాలు నమోదు చేయడంలో బిజీగా ఉంది. ఇటీవలే రిలీజ్ చేసిన టైటిల్ అనౌన్స్ మెంట్ గ్లిమ్ప్స్ మార్కెట్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఇంకా బిజినెస్ జరగకుండా, ఓటిటి అమ్మకుండానే వెయ్యి కోట్ల లాభం ఏమిటనుకుంటున్నారా. ఇక్కడో మతలబు ఉంది. అదేంటంటే రామాయణ నిర్మిస్తున్న ప్రైమ్ ఫోకస్ సంస్థ మార్కెట్ షేర్ ధర జూన్ 25 వరకు 113 రూపాయల 47 పైసలు ఉండేది. టీజర్ వచ్చాక జూలై 1 నాటికి 149 రూపాయలు 69 పైసలకు చేరింది. ప్రస్తుతం 169 రూపాయలకు చేరుకోవడం అనూహ్యం.

అంటే ప్రైమ్ ఫోకస్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4638 కోట్ల నుంచి 5641 కోట్లకు చేరుకుంది అంటే వెయ్యి కోట్ల పెరుగుదల. ఇది రామాయణ ప్రభావమేనని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఇంత భారీ పెరుగుదల గతంలో ఎప్పుడూ జరగలేదట. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ విజువల్ గ్రాండియర్ మీద ఆడియన్స్ లో పెరుగుతున్న నమ్మకం, భారీ క్యాస్టింగ్, రన్బీర్ కపూర్ – యాష్ – సాయిపల్లవి పేర్లు అంతకంతా అంచనాలు పెంచుతున్నాయి. దర్శకుడు నితేశ్ తివారికి రాజమౌళి అంత బ్రాండ్ లేకపోయినా బజ్ విషయంలో ఆయనకు ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో ప్యాన్ ఇండియా క్రేజ్ వచ్చేస్తోంది.

ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే సంవత్సరం సినిమా రిలీజయ్యే నాటికి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే. ట్రైలర్, ప్రమోషనల్ మెటీరియల్ బయటికి వచ్చే కొద్దీ షేర్ వేల్యూ మరింత పెరగడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఒక సినిమా నిర్మాణం ఒక సంస్థ షేర్ మార్కెట్ మీద ఇంత సానుకూలంగా ప్రభావం చూపించడం అరుదు. రెండు భాగాలు ఏడాది గ్యాప్ లో 2026, 2027 దీపావళి పండగకు రిలీజ్ కాబోతున్నాయి. దీనికి కాంపిటీషన్ ఇచ్చే సాహసం ఎవరూ చేయకపోవచ్చు. ఆదిపురుష్ తో రాముడి కథని సరిగా తీయలేదని తీవ్ర విమర్శలు ఎదురుకున్న బాలీవుడ్ ఆశలన్నీ ఇప్పుడు రామాయణ మీదే ఉన్నాయి.