కింగ్ డమ్ కాకుండా ఇంకో కథ ఏది

జూలై 31 విడుదల కాబోతున్న కింగ్ డమ్ కోసం విజయ్ దేవరకొండ అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. లైగర్, ఫ్యామిలీ స్టార్ వైఫల్యాల తర్వాత ఇది ఖచ్చితంగా కంబ్యాక్ అవుతుందనే నమ్మకం టీమ్ లో కనిపిస్తోంది. ఇప్పటిదాకా వచ్చిన టీజర్లు అంచనాలకు ఉపయోగపడగా ట్రైలర్ తర్వాత హైప్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోతుందని అంటున్నారు. హరిహర వీరమల్లు రిలీజయ్యాక పబ్లిసిటీ స్పీడ్ పెంచబోతున్నారు. అటుపై వారం రోజుల పాటు నాన్ స్టాప్ గా ప్రచార కార్యక్రమాలు ఊపందుకోబోతున్నాయి. ఈ సందర్భంగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో రౌడీ బాయ్ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటున్నాడు.

కింగ్ డమ్ ప్రారంభానికి ముందు విజయ్ వద్దకు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రెండు స్క్రిప్ట్స్ తీసుకొచ్చాడు. వాటిలో ఒకటి ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న వేరే హీరో స్టోరీకి చాలా దగ్గరగా అనిపించింది. తమ సినిమానే వేగంగా పూర్తి చేసే అవకాశం ఉన్నా అది నైతికంగా కరెక్ట్ కాదని భావించి విజయ్ దేవరకొండ కింగ్ డమ్ ని ఎంచుకున్నాడు. పైగా ప్రొడక్షన్ లో ఉన్న మూవీ తాలూకు ప్రొడ్యూసర్లు తనకు దగ్గరి వారు కావడంతో ఇంకే ఆలోచన చేయలేదు. అయితే ఆ మూవీ ఏది, సదరు స్టార్ ఎవరనేది మాత్రం విజయ్ దేవరకొండ చెప్పలేదు. దీంతో ఆన్ లైన్ వేదికగా అభిమానులు తమకు తోచిన రీతిలో ఏవేవో అనాలిసిస్ లు చేసుకుంటున్నారు.

ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది ఒకటుంది. కింగ్ డమ్ కన్నా ముందు గౌతమ్ తిన్ననూరితో యువి క్రియేషన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ అది ముందుకు వెళ్ళలేదు. ఈలోగా గేమ్ ఛేంజర్ ప్రతిపాదన, దానికి శంకర్ దర్శకుడు కావడంతో వెంటనే పట్టాలు ఎక్కేసింది. గౌతమ్ సితార సంస్థను కలిసి విజయ్ దేవరకొండకు షిఫ్ట్ అయిపోయాడు. అయితే చరణ్ కు చెప్పింది కింగ్ డమ్ కథేనా వేరేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంటుంది. జెర్సీ హిందీ రీమేక్ ఫ్లాప్ తర్వాత గౌతమ్ కి ఈ ప్యాన్ ఇండియా మూవీ చాలా కీలకం. బ్లాక్ బస్టర్ అయితే మటుకు ప్యాన్ ఇండియా టాప్ లీగ్ లోకి వెళ్ళిపోతాడు.