టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో విషమ స్థితిలో ఉన్న అతడి గురించి మీడియా ఇటీవల వెలుగులోకి తెచ్చింది. అత్యవసరంగా కిడ్నీ మార్చాల్సిన పరిస్థితి తలెత్తగా.. అందుకు సరిపడా డబ్బులు లేక కుటుంబం ఇబ్బంది పడుతున్నట్లు కథనాలు వచ్చాయి. సినీ పరిశ్రమ నుంచి ఫిష్ వెంకట్‌ను ఎవ్వరూ ఆదుకోవడం లేదంటూ మీడియా పేర్కొనగా.. ప్రభాస్ అసిస్టెంట్ తమకు కాల్ చేసి సాయానికి ముందుకు వచ్చినట్లు వెంకట్ తనయురాలు ముందు ఒక వీడియోలో చెప్పింది. కానీ తర్వాతేమో ఆ కాల్ ఫేక్ అని.. ఫోన్ చేసింది ప్రభాస్ పీఏ కాదని ఆమె స్పష్టం చేసింది.
మరోవైపు చిరంజీవి గతంలో సర్జరీ చేయడానికి ముందుకు రాగా.. ఒక స్నేహితుడిని నమ్మి వెంకట్ మోసపోయినట్లుగా ఆమె చెప్పింది. ఐతే సినీ రంగం నుంచి సాయం సంగతి పక్కన పెడితే.. ఫిష్ వెంకట్ ట్రీట్మెంట్ విషయంలో కుటుంబ సభ్యులకు బెంగ తీరిపోయినట్లే. ఆయన చికిత్స ఖర్చును భరించడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది.
వెంకట్ విషయం తెలిసి స్వయంగా మంత్రి వాకిటి శ్రీహరి.. ఆసుపత్రికి వెళ్లి తనను పరామర్శించి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. వెంకట్ చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుందని ఆయన ప్రకటించారు. అంతే కాక తక్షణ ఖర్చుల కోసం ఆయన రూ.లక్ష మొత్తాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. వెంకట్ హైదరాబాద్ బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆసుపత్రితో చికిత్స పొందుతున్నారు. కిడ్నీలు దెబ్బ తినడంతో ఇన్నాళ్లూ డయాలసిస్‌తో నెట్టుకొచ్చాడు వెంకట్. కానీ అవి పూర్తిగా పాడైపోవడంతో ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. కిడ్నీ డోనర్ల కోసం కుటుంబం ఎదురు చూస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates