సంక్రాంతికి వస్తున్నాంతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకటేష్ ఇప్పటికి ఆరు నెలల గ్యాప్ తీసుకున్నారు. కొత్త సినిమా ఎప్పుడు మొదలు పెడతారాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. రకరకాల లీకులు ఉన్నప్పటికీ దేనికీ అధికారిక ముద్ర లేకపోవడంతో ఫ్యాన్స్ వెయిటింగ్ మోడ్ లో ఉన్నారు. వాటికి వెంకటేష్ స్వయంగా చెక్ పెట్టారు. యుఎస్ లో జరుగుతున్న నాట్స్ 2025 వేడుకలో తన నుంచి రాబోయే చిత్రాల గురించి స్వయంగా క్లారిటీ ఇచ్చేశారు. వాటిలో అందరూ ఎదురు చూస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ ఉంది. షూటింగ్ గట్రా వివరాలు చెప్పలేదు కానీ స్పష్టంగా కుండ బద్దలు కొట్టారు.
చిరంజీవి మెగా 157లో చేయబోయే క్యామియో చాలా సరదాగా ఉంటుందని, ఆ తర్వాత మీనాతో కలిసి దృశ్యం 3 చేయబోతున్న అప్డేట్ కూడా అక్కడే ఇచ్చేశారు. అనిల్ రావిపూడితో మరోసారి కలయికని కన్ఫర్మ్ చేస్తూ చూచాయగా సంక్రాంతికి వస్తున్నాం సీక్వెలని చెప్పకనే చెప్పారు. అన్నింటికన్నా పెద్దది బాలకృష్ణతో చేయబోయే సినిమా అవుతుందని చివర్లో కొసమెరుపు ఇవ్వడం గమనార్హం. నిన్నటి తరం సీనియర్ హీరోల్లో వెంకటేష్ ఎవరితోనూ స్క్రీన్ షేర్ చేసుకునే సందర్భం రాలేదు. చిరు, బాలయ్యతో అది వేరవేరబోతుండగా నాగార్జునది పెండింగ్ లో ఉంటుంది. అవుతుందో లేదో చెప్పలేం.
మొత్తానికి వెంకటేష్ ఇచ్చిన అప్డేట్స్ ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచెత్తుతున్నాయి. గ్యాప్ వస్తే వచ్చింది కానీ ఇకపై నాన్ స్టాప్ గా సినిమాలు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్రివిక్రమ్, దృశ్యం 3 సమాంతరంగా షూటింగ్ జరుపుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మూడు భాషల్లో ఒకేసారి విడుదల చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి ప్రాధాన్యం పరంగా దృశ్యం 3 ఆలస్యం చేయడానికి ఉండదు. అన్నింటికన్నా ముందు రిలీజయ్యేది మాత్రం మెగా 157. చిరంజీవి, వెంకటేష్ తెరమీద కలిసి చేయబోయే అల్లరి మీద ఇప్పటికే ఓ రేంజ్ అంచనాలున్నాయి. వచ్చే నెల నుంచి సెట్స్ లో అడుగుపెట్టబోతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates