జనాన్ని థియేటర్లకు రప్పించాలంటే చిన్న సినిమా నిర్మాతలకు తల ప్రాణం తోకలోకి వస్తోంది. ఎంత వెరైటీగా ప్రమోషన్లు చేసినా సరే చాలా చోట్ల మార్నింగ్ షో వేయించడం పెద్ద సవాల్ అయిపోయింది. మొదటి రోజు మొదటి ఆటకు కనీసం పది మంది లేక బుకింగ్ కౌంటర్లు మూసేస్తున్న దాఖలాలు ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వర్జిన్ బాయ్స్ టీమ్ కొత్తగా ఆలోచించింది. టికెట్లు కొన్నవాళ్ళలో పదకొండు మందికి లక్కీ డ్రా ద్వారా ఐఫోన్లను అందజేయబోతున్నారు. అంతే కాదు షో రన్ అవుతున్న టైంలో పైన్నుంచి డబ్బులు విసిరేస్తారట. సీట్లలో కూర్చున్న జనాల మీద పడితే వాళ్ళ అదృష్టం.
ఐఫోన్ ఐడియా బాగుంది కానీ మరీ నోట్లు విసిరేయడం కొంచెం అటుఇటుగా అనిపిస్తోంది. ఎందుకంటే ఆడియన్స్ ఈ నోట్ల కోసం గొడవలు పడితే లేనిపోని ఇబ్బంది. ఎంత కరెన్సీ వేస్తారనేది చెప్పడం లేదు. అయిదు వందల నోట్లా లేక యాభై వందా అనేది వేచి చూడాల్సి ఉంటుంది. ఒకరకంగా చూసుకుంటే ఈ పబ్లిసిటీ ఏదో వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. ఎలాగూ టైటిల్ ని బట్టి చూస్తే ఇది పూర్తిగా యూత్ ని టార్గెట్ చేసుకున్న సినిమా కాబట్టి కాలేజీ పిల్లలు వస్తారు. పైగా ఐఫోన్, ఫ్రీ మనీ అంటే టెంప్ట్ కాకుండా ఉంటారా. ఒకవేళ ఇది కనక మంచి ఫలితం ఇస్తే కనక ఇతర ప్రొడ్యూసర్లు ట్రై చేయొచ్చు.
ఇలాంటివి గతంలోనూ కొన్ని జరిగాయి. మొదటి రోజు బెనిఫిట్ షో ఉచితంగా ప్రదర్శించడం, మహిళలకు ఫ్రీ ఆటలు, ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ, విలన్ ఎవరో కనుక్కుంటే పది వేల రూపాయల గిఫ్ట్, వంద రూపాయలకే బాల్కనీ ఇలా రకరకాలుగా పబ్లిక్ ని రప్పించే ప్రయత్నాలు చాలా జరిగాయి. ఇప్పుడు వర్జిన్ బాయ్స్ వేసిన స్ట్రాటజీ ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. జూలై 11 నుంచి ఘాటీ తప్పుకోవడంతో వర్జిన్ బాయ్స్ తో పాటు సుహాస్ ఓ భామ అయ్యో రామాకు మంచి ఛాన్స్ దొరికింది. హరిహర వీరమల్లు వచ్చే దాకా రెండు వారాల గ్యాప్ దొరుకుతుంది కాబట్టి ఆ ఛాన్స్ వాడుకోవడానికి ట్రై చేస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates