సుధ కొంగర.. ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతున్న పేరు. ఇప్పటిదాకా ఇండియాలో రిలీజైన ఓటీటీ సినిమాల్లో అతి పెద్ద హిట్ డెలివర్ చేసిన ఘనత ఈ తెలుగమ్మాయిదే. సూర్య హీరోగా ఆమె తెరకెక్కించిన ‘ఆకాశం నీ హద్దురా’ ఇటు తెలుగులో, అటు తమిళంలో మంచి స్పందన రాబట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆ సినిమా మెప్పించింది.
ఒక నిజ జీవిత గాథను అతిశయోక్తులు లేకుండా సాధ్యమైనంత సహజత్వంతో, కట్టు తప్పని భావోద్వేగాలతో సుధ తెరకెక్కించిన తీరు ప్రశంసలందుకుంటోంది. వరుస ఫ్లాపులతో అల్లాడిపోయిన సూర్యకు అత్యాశ్యకమైన విజయాన్నందించిన ఘనత కూడా సుధదే. ఓవైపు దర్శకురాలిగా గొప్ప ప్రతిభ చూపించడమే కాక.. కమర్షియల్‌గా కూడా వర్కవుటయ్యే సినిమా అందించడంతో సుధ పేరు ఇప్పుడు మార్మోగుతోంది.
ఆల్రెడీ అజిత్‌తో ఓ సినిమాకు సుధ దర్శకురాలిగా ఎంపికైంది. అలాగే విజయ్ సైతం ఆమెతో సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలొస్తున్నాయి. తెలుగు నుంచి కూడా స్టార్ హీరోలు ఆమెతో సినిమా చేయడానికి ఆసక్తి చూపితే ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఇంత పేరు, డిమాండ్ తెచ్చుకున్న సుధ.. ఒకప్పుడు తెలుగులో ‘ఆంధ్రా అందగాడు’ అనే చిన్న సినిమా తీసిన సంగతి చాలామందికి తెలియదు. కృష్ణభగవాన్, సుమన్ శెట్టి కీలక పాత్రలు పోషించారందులో.
ఆ సినిమా విడుదలైనట్లు కూడా జనాలకు తెలియదు. తర్వాత తమిళంలో ‘ద్రోహి’ అనే మరో సినిమా తీసింది. అది విమర్శకుల ప్రశంసలందుకున్నా.. కమర్షియల్ సక్సెస్ సాధించలేదు. ఐతే కొన్నేళ్ల విరామం తర్వాత మాధవన్ ప్రధాన పాత్రలో తమిళ, హిందీ భాషల్లో ఇరుదు సుట్రు/సాలా ఖడూస్ తీసింది. ఆ సినిమా పెద్ద హిట్టయింది. దాన్ని తెలుగులో ‘గురు’గా రీమేక్ చేసిన సుధ.. ఇక్కడా హిట్టు కొట్టింది. తర్వాత సూర్య ఆమెను నమ్మి అవకాశమిస్తే అతడి కెరీర్‌కు ఊపిరి పోసే సినిమా అందించింది. ఈ మణిరత్నం శిష్యురాలు ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడిదాకా వచ్చిందో చూస్తే.. ఆశ్చర్యం కలగక మానదు.