ఆ సినిమా బడ్జెట్.. 1600 కోట్లా?

బడ్జెట్లు, వసూళ్ల విషయంలో ఒకప్పుడు బాలీవుడ్ ఎంతో ఎత్తులో ఉండేది. దక్షిణాది చిత్రాలు హిందీ సినిమాలకు దరిదాపుల్లో ఉండేవి కావు. కానీ ‘బాహుబలి’ తర్వాత అంతా మారిపోయింది. సౌత్ సినిమాలు, ముఖ్యంగా తెలుగు చిత్రాల బడ్జెట్లు, కలెక్షన్లు ఎక్కడికో వెళ్లిపోయాయి. రికార్డులన్నీ మన సినిమాల సొంతం అయ్యాయి. బాలీవుడ్ బాగా వెనుకబడిపోయింది. కానీ ఇప్పుడు బాలీవుడ్ మళ్లీ తన పవర్ చూపించడానికి సిద్ధమవుతోంది. ‘రామాయణం’ సినిమా మొత్తం లెక్కలన్నీ సవరిస్తామని బాలీవుడ్ ధీమాతో ఉంది. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ సినిమా షో రీల్‌‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంతో ఇండియన్ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కొత్త ఒరవడి సృష్టించగలమని మేకర్స్ ధీమాగా ఉన్నారు.

అకాడమీ అవార్డ్ విన్నింగ్ వీఎఫెక్స్ స్టూడియోను ఈ సినిమా కోసం హైర్ చేసుకున్న టీం.. మొత్తం సినిమా మీద అసాధారణ స్థాయిలో బడ్జెట్ పెడుతోందట. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న ‘రామాయణం’ మీద మొత్తంగా రూ.1600 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు బాలీవుడ్ మీడియా రిపోర్ట్ చేస్తోంది. వచ్చే ఏడాది దీపావళికి రాబోతున్న ‘రామాయణం’ పార్ట్-1 మీదే రూ.900 కోట్లు ఖర్చు చేస్తున్నారట. రెండో భాగానికి రూ.700 కోట్లు అవుతుందట. కొన్నేళ్ల పాటు జరిగిన ప్రి ప్రొడక్షన్ పనులకు తోడు భారీ సెట్టింగ్స్ వేయడం వల్ల ‘పార్ట్-1’కు ఎక్కువ బడ్జెట్ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సెట్స్‌లో కొన్ని రెండో భాగానికి వాడుకోబోతుండడం, కొత్తగా ప్రి ప్రొడక్షన్ పనులు లేకపోవడం వల్ల పార్ట్-2 బడ్జెట్ రూ.200 కోట్లు తగ్గనుంది. ఈ స్థాయిలో ఖర్చు చేసి రికవర్ చేయగలరా అన్న సందేహాలు కలుగుతున్నాయి కానీ.. ‘రామాయణం’ కథకు ఉన్న పొటెన్షియాలిటీ, తమ మేకింగ్ మీద కాన్ఫిడెన్స్‌తో భారీగా లాభాలు కూడా అందుకోగలమని టీం ధీమాగా ఉంది. ఇటీవలి షో రీల్ చూస్తే సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసేలాగే ఉంది. ఇందులో రణబీర్ రాముడి పాత్ర చేయగా.. సీతగా సాయిపల్లవి కనిపించనుంది. యశ్ రావణుడి పాత్రను పోషించాడు.