తమిళ భాషాభిమానం ఎలాంటిదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ అభిమానం కొన్నిసార్లు హద్దులు దాటిపోతుంటుంది. ప్రపంచంలో తమదే గొప్ప భాష అంటారు. వేరే భాషల్ని తక్కువ చేయడానికి కూడా వెనుకాడరు. ఇతర భాషల గొప్పదనాన్ని వాళ్లు ఒప్పుకోవడం అరుదు. అలాంటిది తమిళ బిగ్ బాస్ షోలో మన తెలుగు గొప్పదనాన్ని చాటుతూ.. మన మహా కవి శ్రీశ్రీ రాసిన ఒక కవితను చదివి వినిపించడం అన్నది అనూహ్యమైన విషయం. ‘బిగ్ బాస్’ తాజా ఎపిసోడ్లో ఈ అద్భుతం జరిగింది.
ఇదంతా ఆ షో హోస్ట్ కమల్ హాసన్ గొప్పదనం. తెలుగు ప్రస్తావన ఎందుకొచ్చిందో ఏమో కానీ.. కంటెస్టంట్లను ఉద్దేశించి ఆయన తెలుగు భాష గొప్పదనాన్ని అద్భుతంగా చెప్పాడు భారతీయార్ తెలుగును ఉద్దేశించి ‘సుందర తెలుగు’ అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ మన భాష ఔన్నత్యాన్ని ఆయన చాటి చెప్పాడు.
శ్రీశ్రీ రాసిన ‘పతితులారా.. భ్రష్టులారా.. బాధా సర్ప ద్రష్టులారా.. దగా పడిన తమ్ములారా…’ కవితను కమల్ తనదైన శైలిలో ఉద్వేగంతో పలికారు. తాను నటించిన ‘ఆకలి రాజ్యం’ సినిమా కోసం శ్రీశ్రీ ఈ కవిత రాసినట్లు గుర్తు చేసుకుంటూ.. ఆ కవితలోని ప్రతి మాటకూ తమిళంలో అర్థం చెప్పారు కమల్. ఈ సందర్భంగానే భారతీయార్ ‘సుందర తెలుగు’ అని పేర్కొన్న విషయాన్ని కూడా గుర్తు చేశారు.
కమల్ ఆ కవిత చెప్పి.,. దాని అర్థం వివరిస్తుంటే ‘బిగ్ బాస్’ కంటెస్టంట్లందరూ అమితాసక్తితో ఉన్నారు. ఒక వ్యక్తి అయితే తెలుగు కవిత అర్థం తెలియకపోయినా దాని ఇంటెన్సిటీ అర్థమైందన్నాడు. ఇలా ఓ తమిళ షోలో తెలుగు భాష గొప్పదనం గురించి చర్చ జరగడం అనూహ్యమైన విషయం.
కమల్ తెలుగు నేర్చుకోవడమే కాదు.. మన భాషలో ఎన్నో పుస్తకాలు కూడా చదివారు. మన భాష గొప్పదనం తెలుసుకున్నారు. ప్రకాష్ రాజ్‌కు సైతం తెలుగు గొప్పదనం, మన సాహిత్య ఔన్నత్యం తెలుసుకుని ఎన్నో పుస్తకాలు చదవడం విశేషం.