‘వీరమల్లు’ రిలీజ్ మారదు.. రికార్డులు మారతాయి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన, సుదీర్ఘ సమయం చిత్రీకరణ దశలో ఉన్న సినిమా.. హరిహర వీరమల్లు. ఈ సినిమా అనౌన్స్ అయి దాదాపు ఆరేళ్లు కావస్తోంది. కొవిడ్ సహా పలు కారణాలతో సినిమా విపరీతంగా ఆలస్యం అయింది. విడుదల కూడా పలుమార్లు వాయిదా పడింది. చిత్రీకరణ పూర్తయ్యాక కూడా కొన్ని కారణాలతో రిలీజ్ డేట్ మార్చక తప్పలేదు. ఐతే కొత్తగా ప్రకటించిన జులై 24న మాత్రం ‘హరిహర వీరమల్లు’ రావడం పక్కా అంటున్నాడు దర్శకుడు జ్యోతికృష్ణ. ఈసారి రిలీజ్ డేట్ మారదని.. తెలుగు సినిమా రికార్డులు మాత్రం మారతాయిని అతను ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో పేర్కొన్నాడు.

ఈ సందర్భంగా అతను ‘వీరమల్లు’ మీద అదే పనిగా విమర్శలు చేస్తూ వచ్చిన వారికి దీటుగా సమాధానం చెప్పాడు. తనకంటే ముందు చాలా వరకు ‘వీరమల్లు’ చిత్రాన్ని తెరకెక్కించిన క్రిష్ గురించి కూడా అతను ప్రస్తావించడం విశేషం. ‘‘ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అయ్యాక కొందరి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వాళ్లెవ్వరో కూడా నాకు తెలియదు. ఎలా ఉంటాారో తెలియదు. ఈ సినిమా మొదలైన దగ్గర్నుంచి దీని గురించి నెగెటివ్‌గా ప్రచారం చేస్తూనే ఉన్నారు.

సినిమా రాదని.. ఆగిపోయిందని కామెంట్ చేస్తూనే ఉన్నారు. వాళ్లందరికీ ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. కొవిడ్ సమయంలో మా సినిమా ఆగింది. తర్వాత పవన్ గారు రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఎన్నికల్లో గెలిచి ఉపముఖ్యమంత్రి అయ్యారు. కానీ వాళ్లు మాత్రం మా సినిమా గురించి నెగెటివ్ ప్రచారం ఆపలేదు. మేం మాత్రం మా పని చేసుకుంటూనే ఉన్నాం. వాళ్లు రాసే పిచ్చి రాతలు, నెగెటివ్ కామెంట్లు కంచుకోటను కదిలించలేవు. అభిమానులు సినిమా చూడకుండా ఆపలేవు.

ఈ సినిమాకు బడ్జెట్ ఎక్కువైంది. వర్కవుట్ అవుతుందా అని కొందరన్నారు. కానీ పవన్ గారి సినిమాలకు ఎంత బడ్జెట్ పెట్టినా తక్కువే. రత్నం గారు ఎప్పుడూ పెద్ద బడ్జెట్ సినిమాలే తీశారు. పవన్ గారు ‘ఖుషి’ సినిమాతోనే రికార్డులు బద్దలు కొట్టారు. గ్యాప్ తర్వాత ‘గబ్బర్ సింగ్’ చిత్రంతో వంద కోట్ల వసూళ్లు సాధించారు. ఈసారి ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ మారదు. రికార్డులు మాత్రమే మారతాయి. ఈ సినిమాకు నేనొక్కడినే కష్టపడలేదు. ‘హరిహర వీరమల్లు’కు పునాది వేసిన క్రిష్ గారికి కృతజ్ఞతలు. త్రివిక్రమ్ గారు కూడా ఒడుదొడుకుల్లో మాకు తోడుగా ఉన్నారు’’ అని జ్యోతికృష్ణ అన్నాడు.