మెగా రావిపూడి… 70 % కామెడీ 30 % డ్రామా

ఇంకా సగం షూటింగ్ కాకుండానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మెగా 157 మీద అంచనాలు ఓ రేంజ్ లో ఎగబాకుతున్నాయి. ఒక్క పాట తప్ప మొత్తం పూర్తయిన విశ్వంభర కన్నా దీని మీద ఎక్కువ బజ్ ఏర్పడటం విశేషం. ప్రమోషన్లలో అనిల్ తనదైన మార్కు చూపిస్తూనే ఉన్నాడు. పూజా ఓపెనింగ్ నుంచి నయనతార పరిచయం దాకా ప్రతిదాంట్లోనూ అతని ముద్ర కనిపిస్తోంది. చిరంజీవితో ఇంత వేగంగా చిత్రీకరణ జరుగుతున్న దర్శకులు గత కొన్నేళ్లలో ఎవరూ లేరు. సందర్భం దొరికినప్పుడంతా అనిల్ రావిపూడి ఈ సినిమాకు సంబంధించిన కబుర్లు ఒక్కొక్కటిగా పంచుకుంటున్నాడు.

తాజాగా ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మెగా 157లో సంక్రాంతికి వస్తున్నాం తరహాలో కాకుండా 70 పర్సెంట్ కామెడీ, 30 పర్సెంట్ డ్రామా ప్లస్ ఎమోషన్ ఉంటుందని చెప్పాడు. ఒకప్పటి గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు తరహా వింటేజ్ క్యారెక్టరైజేషన్ ఇందులో డిజైన్ చేశానని ఎలివేషన్ ఇచ్చాడు. చిరు, నయనతారల మధ్య భార్యా భర్తల బాండింగ్ కొత్త తరహాలో ఉంటుందని చిన్న క్లూ ఇచ్చాడు. వెంకటేష్ పాత్రకు సంబంధించిన డీటెయిల్స్ చెప్పకుండా సరైన సమయం వచ్చినప్పుడు అదొక బ్లాస్ట్ అవుతుందని, అప్పటిదాకా వెయిట్ చేయమని చెప్పాడు.

2026 సంక్రాంతికి రాబోతున్న మెగా 157 టైటిల్ అతి త్వరలో ప్రకటించబోతున్నట్టు ఇంకో శుభవార్త ఇచ్చేశాడు. అనిల్ చెబుతున్న ప్రకారం ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజుకి టీజర్ వచ్చే ఛాన్స్ ఉంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాలో క్యాథరిన్ త్రెస్సాతో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు ఒక ముఖ్యమైన క్యారెక్టర్ చేస్తున్నాడు. బిజినెస్ పరంగా మంచి డీల్స్ వస్తున్నప్పటికీ నిర్మాత సాహు గారపాటి ఇంకా ఎవరికి కమిట్ మెంట్స్ ఇవ్వలేదు. టీజర్ వచ్చాక డిమాండ్ మరింత పెరుగుతుందనే నమ్మకంతో ఇప్పటికి పెండింగ్ పెట్టారట. నవంబర్ నుంచి ప్రమోషన్లు ఊపందుకోబోతున్నాయి.