రీ రిలీజుల తాకిడిలో ‘జూలై’ ఉక్కిరిబిక్కిరి

రాను రాను రీ రిలీజులు వేలం వెర్రిగా మారుతున్నాయి. వర్కౌట్ అవుతాయో లేదో అంచనా వేసుకోకుండా నిర్మాతలు తీసుకుంటున్న రిస్కులు కొందరికి లాభాలు ఇస్తుండగా మరికొందరికి పబ్లిసిటీ ఖర్చులు కూడా తేవడం లేదు. ఇటీవలే విడుదలైన ‘హనుమాన్ జంక్షన్’ని ఆడియన్స్ చాలా లైట్ తీసుకున్నారు. అప్పట్లో ఊపేసిన కామెడీ ఎంటర్ టైనరే అయినప్పటికీ ఎందుకో జనంలో ఆసక్తి కనిపించలేదు. దీనికి స్టార్ హీరోలు సైతం మినహాయింపు కాదు. లక్ష్మి నరసింహ, ఆదిత్య 369 లాంటి వాటికి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. ఖలేజా, జగదేకవీరుడు అతిలోకసుందరి మాత్రమే వాటి రేంజ్ కు తగ్గట్టు వసూళ్లు తెచ్చుకున్నాయి.

ఇదిలా ఉండగా జూలైలో ఈ తాకిడి మరింత ఎక్కువ కానుంది. తమ్ముడు, ఘాటీ, హరిహర వీరమల్లు లాంటి క్రేజీ కొత్త సినిమాలు ఉన్నా సరే పాతవి క్యూ కట్టిస్తున్నారు. 4న ‘హుషారు’ రానుంది. ఇది మరీ పాత మూవీ కాకపోయినా యూత్ ని టార్గెట్ చేసుకుని వదులుతున్నారు. రెండు రోజుల తర్వాత జూలై 7 ‘ఎంఎస్ ధోని’ని దించుతున్నారు. క్రికెట్ లవర్స్ మద్దతు ఉంటుందని అంచనా కాబోలు. జూలై 10 ‘కుమారి 21 ఎఫ్’ రానుంది. సుకుమార్ రచన చేసిన ఈ కల్ట్ మూవీ హీరో రాజ్ తరుణ్ మార్కెట్ ఇప్పుడు అస్సలు బాలేదు. అభిమానుల సంగతేమో కానీ కామన్ ఆడియన్స్ ని నమ్ముకుని రంగంలోకి దిగుతోంది.

జూలై 11న రవితేజ ‘మిరపకాయ్’ వస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మాస్ మూవీలో తమన్ పాటలు, కామెడీ అన్నీ బాగానే ఉంటాయి కానీ ఆల్రెడీ రీ రిలీజైన సినిమాని ఏ ధైర్యంతో దించుతున్నారో అంతు చిక్కని ప్రశ్న. జూలై 18 సూర్య ‘గజిని’ వస్తుంది. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ కల్ట్ బ్లాక్ బస్టర్ ని థియేటర్ లో మిస్సయిన ఇప్పటి టీనేజ్ ఒక లుక్ వేస్తే కలెక్షన్లు ఆశించవచ్చు. జూలై 19 ‘ఏ మాయ చేసావే’ వస్తుంది. నాగచైతన్య, సమంతలు ప్రమోట్ చేసే ఛాన్స్ లేదు. జూలై 19 ఇంకో సూర్య సినిమా ‘వీడొక్కడే’ వస్తోంది. అమాయకత్వం కాకపోతే ఒకే నెలలో ఇన్నేసి రీ రిలీజులు చేస్తే థియేటర్లు నిండుతాయా.