అడివి శేష్ చెబుతున్న గ్యాప్ పాఠాలు

టాలెంట్ ఉన్న మీడియం రేంజ్ హీరోల నుంచి రెగ్యులర్ గా సినిమాలు రావాలి. అప్పుడే థియేటర్లు కళకళలాడతాయి. అలాంటిది వాళ్ళు కూడా రెండు మూడేళ్లు గ్యాప్ తీసుకోవడం ఎంతమాత్రం సరికాదు. ఈ విషయంలో పలువురు ఎగ్జ్బిటర్లు స్పీడ్ పెంచమని విన్నపాలు చేస్తుంటారు కానీ వాటిని పాటించిన దాఖలాలు టాలీవుడ్ లో చాలా తక్కువ. అడివి శేష్ దీనికి సంబంధించి చాలా స్పష్టతతో ఉన్నాడు. ఇటీవలే ఇచ్చిన ఒక పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో తాను ఎందుకు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చిందో వివరిస్తూ మారుతున్న ట్రెండ్స్ గురించి ఎక్స్ ప్లయిన్ చేసిన విధానం ఆలోచింపజేసేలా, విశ్లేషింపజేసేలా ఉంది.

అడివి శేష్ వెర్షన్ ప్రకారం కరోనా టైం నుంచి ఆడియన్స్ బాగా అప్డేట్ అయిపోయారు. వివిధ భాషల్లో కంటెంట్ ని చూసేందుకు అలవాటు పడ్డారు. అయిదేళ్ల క్రితం విజువల్ ఎఫెక్ట్స్ ని వావ్ అన్నవాళ్ళు ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో అంచనాలు పెట్టుకుంటున్నారు. వాటిని అందుకోవాలంటే అతి జాగ్రత్త అవసరం. అంతర్జాతీయ స్థాయిలో ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు కానీ దానికి తగ్గ బడ్జెట్స్ ఇక్కడ లేవు. అక్కడ ముగ్గురు చేసే పనికి ఇక్కడో పది మంది కావాలి. ఇవన్నీ జాగ్రత్తగా బ్యాలన్స్ చేసుకుంటూ క్వాలిటీ ఇచ్చే క్రమంలో ఎక్కువ సమయం అవసరమవుతోంది. అందుకే గ్యాప్ తప్పదు.

ఇందులో చాలా లాజిక్ ఉంది. విశ్వంభర మీద వచ్చిన నెగటివిటీ కన్నా మంచి ఉదాహరణ అక్కర్లేదు. అందుకే అడివి శేష్ నాణ్యత కోసం వేచి చూడక తప్పదు అంటున్నాడు. ప్రస్తుతం తను హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ డెకాయిట్ డిసెంబర్ 25 విడుదలకు రెడీ అవుతోంది. గూడచారి 2 వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఈ రెండింటి మీద భారీ బడ్జెట్ లు పెట్టారు. విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యం ఉంది. హిట్ 3 ది థర్డ్ కేస్ లో జస్ట్ అలా మెరిసిన అడివి శేష్ ని ఫుల్ లెన్త్ రోల్ లో చూడాలంటే ఇంకో ఆరు నెలలు ఎదురు చూడక తప్పదు. ఎందుకంటే క్వాలిటీ కోసమే.