నన్ను నమ్మండి.. ‘కింగ్‌డమ్’తో ఫుల్ మీల్సే

అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్లతో ఒక దశలో విజయ్ దేవరకొండ ఊపు మామూలుగా లేదు. తాను పదేళ్లు కష్టపడితే వచ్చిన స్టార్‌డమ్‌ను విజయ్ కెరీర్ ఆరంభంలోనే సంపాదించేశాడంటూ మెగాస్టార్ చిరంజీవి సైతం కొనియాడంటే అతను ఏ రేంజికి వెళ్లాడో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ ఫాలోయింగ్, మార్కెట్‌ను అతను నిలబెట్టుకోలేకపోయాడు. సరైన సినిమాలు ఎంచుకోలేక చతికిలబడ్డాడు. లైగర్, ఫ్యామిలీ స్టార్ సినిమాలు విజయ్ కెరీర్‌కు మామూలు డ్యామేజీ కాదు. ఇంకో డిజాస్టర్ పడితే కెరీర్ ప్రశ్నార్థకమయ్యే స్థితిలో అతను ‘కింగ్‌డమ్’ సినిమాను మొదలుపెట్టాడు.

‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తీస్తున్న సినిమా కావడంతో దీనిపై అభిమానుల్లో ఆశలు ఉన్నాయి. పైగా టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ బేనర్లలో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్స్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడం ఇంకా ప్లస్. కాకపోతే సినిమా రిలీజ్ బాగా ఆలస్యం అవుతుండడం.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలూ ఎంతకీ ఒక కొలిక్కి రాకపోవడంతో విజయ్ అభిమానుల్లో అసహనం పెరిగిపోతోంది. సినిమాకు రీషూట్లు ఏమైనా జరుగుతున్నాయా అనే సందేహాలు కలుగుతున్నాయి. నిర్మాత నాగవంశీ సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా.. విజయ్ అభిమానులు తిట్టిపోస్తున్నారు.

‘కింగ్‌డమ్’ను పక్కన పెట్టేసి వేరే సినిమాల గురించి మాట్లాడుతున్నాడంటూ కౌంటర్లు వేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే నాగవంశీ.. ‘కింగ్‌డమ్’ గురించి లేటెస్ట్‌గా ఒక పోస్టు పెట్టాడు. ‘‘నన్ను నమ్మండి.. ఈ సినిమాతో మీకు ఫుల్ మీల్సే’’ అంటూ విజయ్ అభిమానులను అతను ఊరించాడు. ‘‘ఏం పోస్ట్ చేసినా ‘కింగ్‌డమ్’ మీద తీయటి శాపనార్థాలు మాత్రం వస్తూనే ఉంటాయి అని తెలుసు. కానీ నన్ను నమ్మండి. ఒక భారీ బిగ్ స్క్రీన్ అనుభవాన్ని ఇవ్వడానికి మా టీం రేయింబవళ్లు కష్టపడుతోంది.

ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఈ సినిమా చూసినపుడు వచ్చే అడ్రెనలిన్ రష్ నమ్మశక్యం కాని విధంగా ఉంటుంది. నేను ఎంతో నమ్మితే తప్ప ఏదీ చెప్పను. ఎందుకంటే అది కొంచెం మిస్ అయినా మీ క్రియేటివిటీ అంతా చూపిస్తారు నా మీద. సినిమా చూశాక చెబుతున్నా.. కింగ్‌డమ్ ఒక విన్నర్. ఇది ఫుల్ మీల్స్ కమర్షియల్ ఎంటర్టైనర్. అదే సమయంలో గౌతమ్ స్టైల్ డ్రామా కూడా ఉంటుంది. త్వరలో అదిరిపోయే రిలీజ్ డేట్ టీజర్, పాట అనౌన్స్‌మెంట్‌తో కలుద్దాం’’ అని నాగవంశీ ట్వీట్ చేశాడు.