కన్నప్ప కాచుకోవాల్సిన అసలు పరీక్ష

మంచు విష్ణు కన్నప్ప దిగ్విజయంగా మొదటి వీకెండ్ పూర్తి చేసుకుంది. నిన్న కిక్కిరిసిపోయే స్థాయిలో రికార్డు కలెక్షన్లని వచ్చాయని చెప్పలేం కానీ ప్రధాన కేంద్రాల్లో మంచి ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ముఖ్యంగా మధ్యాన్నం, సాయంత్రం షోలు దాదాపు హౌస్ ఫుల్స్ కనిపించాయి. డివోషనల్ ఎలిమెంటా లేక ప్రభాస్ ప్రభావమా కారణం ఏదైనా సరే విష్ణు కెరీర్ లోనే అతి పెద్ద నెంబర్లు కన్నప్ప నమోదు చేస్తున్న మాట వాస్తవం. ట్రేడ్ సమాచారం మేరకు మూడు రోజుల గ్రాస్ యాభై నుంచి అరవై కోట్ల మధ్యలో ఉండొచ్చని తెలిసింది. ఖచ్చితమైన అంకెలు రావాలంటే ఇంకొంచెం టైం పట్టేలా ఉంది.

అసలు పరీక్ష కన్నప్పకు ఇప్పుడు మొదలుకానుంది. వీక్ డేస్ మొదలయ్యాయి. పనిదినాల్లో థియేటర్ ఆడియన్స్ శాతం పడిపోవడం సహజం. కాకపోతే బ్లాక్ బస్టర్ కనీసం యాభై శాతానికి పైగా హోల్డ్ చేసుకుని రన్ కొనసాగిస్తాయి. కానీ కన్నప్పకు అంత సీన్ ఉందా అనేది అసలు ప్రశ్న. ఎందుకంటే కేవలం ప్రభాస్ క్యామియో మీద లాంగ్ రన్ ఆశించలేం. దీనికి ఫ్యాన్స్ నుంచి రిపీట్ మద్దతు ఉండదు. ఒకసారి చూసి వదిలేస్తారు. తర్వాత ముందుకు తీసుకెళ్లాల్సింది సాధారణ ప్రేక్షకులు, మాస్, ఫ్యామిలీలే. అందులోనూ డివోషనల్ కంటెంట్ కావడం వల్ల అందరూ వస్తారనే గ్యారెంటీ లేదు. పైగా పైరసీ బెడద మొదలయ్యిందని విష్ణు స్వయంగా ట్వీట్ చేశాడు.

నిన్న బుక్ మై షో ట్రెండ్స్ లో సితారే జమీన్ పర్, ఎఫ్1, మా తర్వాత నాలుగో స్థానంలో కన్నప్ప ఉంది. అంటే మరీ దూసుకుపోవడం లేదనే వాస్తవం అవగతమవుతోంది. కన్నప్ప 92 వేల టికెట్లు అమ్మితే మిక్స్డ్ టాక్ వచ్చిన మా 96 వేల టికెట్లు అమ్మింది. వీటి కన్నా ఎక్కువగా ఎఫ్1 మూవీ 99 వేల టికెట్లు ఖాతాలో వేసుకుంది. సితారే జమీన్ పర్ ఏకంగా 2 లక్షలకు పైగా టికెట్లతో టచ్ చేయనంత దూరంలో ఉంది. ఓన్ రిలీజ్ కాబట్టి కన్నప్ప బ్రేక్ ఈవెన్ ఎంతనేది విష్ణు చెబితే తప్ప బయటికి రాదు. కనీసం వారం పది రోజులు బలమైన హోల్డ్ చూపించగలిగితేనే కన్నప్ప సేఫవుతాడు. ప్రస్తుతానికి అదంత సులభంగా కనిపించడం లేదు.