ఇప్పుడు మణిరత్నం ఫామ్ కోల్పోయి ఉండొచ్చు కానీ.. ఒకప్పుడు ఆయన మామూలు సినిమాలు గా తీయలేదు. నాయగన్, రోజా, బొంబాయి, ఇద్దరు, సఖి, యువ.. ఇలా కల్ట్ ఫిలిమ్స్ అందించారాయన. దేశంలో ఎంతోమంది ఫిలిం మేకర్లకు ఆయన ఇన్‌స్పిరేషన్. అయితే తనకు మాత్రం మణిరత్నం సినిమాలు నచ్చవని అంటున్నాడు ఆయన సమకాలీన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మణిరత్నం కల్ట్ మూవీస్ చేసిన టైంలోనే వర్మ కూడా శివ, రంగీలా, సత్య, కంపెనీ లాంటి మైల్ స్టోన్ మూవీస్ తీశారు. అయితే వ్యక్తిగా తనకు మణిరత్నం నచ్చినా… దర్శకుడిగా మాత్రం ఇష్టపడనని ఓ ఇంటర్వ్యూలో వర్మ తెలిపాడు.
మణిరత్నం సినిమాల్లో ఆల్ టైం గ్రేట్ మూవీ అయిన నాయగన్ కూడా తనకు నచ్చలేదని వర్మ చెప్పడం విశేషం. అందులో కమల్ పెర్ఫామెన్స్ తనకు ఎంతో ఇష్టమని.. అందుకు ఆయన పోషించిన వరదరాజన్ ముదలియార్ పాత్ర కూడా ఒక కారణం కావచ్చని వర్మ పేర్కొన్నాడు. అంతే తప్ప మణిరత్నం దర్శకత్వాన్ని తాను ఇష్టపడలేదని వర్మ తెలిపాడు. నాయగన్ మాత్రమే కాదు.. మణిరత్నం తీసిన మిగతా చిత్రాలు కూడా తనకు నచ్చలేదని వర్మ స్పష్టం చేశాడు. అంతే కాక మణిరత్నంకు కూడా తన సినిమాలు నచ్చేవి కావని వర్మ తెలిపాడు.
ఇక కోలీవుడ్ నుంచి తనను బాగా ఇన్‌స్పైర్ చేసిన దర్శకుడిగా బాలచందర్ పేరు చెప్పాడు వర్మ. స్టోరీ టెల్లింగ్, ఎడిటింగ్ విషయంలో బాలచందర్ నుంచి తాను ఎంతో స్ఫూర్తి పొందినట్లు వర్మ తెలిపాడు. విశేషం ఏంటంటే.. తమ ప్రైమ్ టైంలో వర్మ, మణిరత్నం ఇద్దరూ కలిసి పని చేశారు. వర్మ డైరెక్ట్ చేసిన గాయం చిత్రానికి మణిరత్నం రచనా సహకారం అందించారు. అలాగే మణిరత్నం తీసిన దొంగా దొంగా సినిమాకు వర్మ రచయితగా పని చేశారు. కానీ పేరుకు కలిసి పని చేశాం కానీ.. తామిద్దరం ఒకరి మాట ఒకరు వినలేదని.. ఎవరి శైలిలోనే వాళ్లు సినిమాలు తీశామని వర్మ తెలిపాడు. తమ ఇద్దరిలోనూ ఎవరికి వారికి సొంత శైలి ఉందని.. ఆ శైలిలోనే సినిమాలు తీశామని.. ఒకరి ప్రభావం ఒకరి మీద పడలేదని వర్మ తెలిపాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates