జూలై 4 విడుదలకు తమ్ముడు రెడీ అవుతున్నాడు. కుబేర టాలీవుడ్ బాక్సాఫీస్ కు మంచి కిక్ ఇచ్చాడు. కన్నప్ప ఓపెనింగ్స్ చూసి బయ్యర్లు ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు వరసగా మూడో వారం ఈ జోష్ కొనసాగించాల్సిన బాధ్యత నితిన్ మీద ఉంది. అయితే ఆశ్చర్యకరంగా దీనికి సెన్సార్ నుంచి ఏ సర్టిఫికెట్ రావడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఎందుకంటే దిల్ రాజు గారి ఎస్విసి బ్యానర్ అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్న క్లీన్ ఎంటర్ టైనర్స్ వస్తాయి. రామ్ చరణ్, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి ఎంత పెద్ద ప్యాన్ ఇండియా స్టార్లు ఉన్నా సరే కంటెంట్ లో వయొలెన్స్ పరిమిత మోతాదులోనే ఉంటుంది.
కానీ తమ్మడుకి ఏ రావడం విచిత్రం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ కు సంబంధించిన విజువల్స్ లో కాస్త హింస ఎక్కువగా ఉందట. సబ్జెక్టు డిమాండ్ మేరకు దర్శకుడు వేణు శ్రీరామ్ వాటిని పొందుపరిచారని, మరీ ఎబ్బెట్టుగా లేకపోయినా నిబంధనల ప్రకారం అధికారులు ‘ఏ’ జారీ చేశారని అంటున్నారు. ముఖ్యంగా సెకండాఫ్ లో బస్సు ఛేజ్ తో పాటు రెండు ముఖ్యమైన ఫైట్లలో రక్తపాతం భారీగానే ఉందట. అయితే వాటికి కారణంగా చూపించే ఫ్లాష్ బ్యాక్ కుటుంబ ప్రేక్షకులు సైతం అంగీకరించేలా వచ్చిందట. అందుకే దిల్ రాజు సైతం ప్రొసీడ్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్.
హ్యాట్రిక్ ఫ్లాపుల్లో ఉన్న నితిన్ ఆశలన్నీ తమ్ముడు మీదే ఉన్నాయి. ఈసారి ప్రమోషన్లలో హడావిడి చేయకుండా లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తున్నాడు. సినిమా సక్సెస్ అయ్యాక అందరితో ఆనందం పంచుకుంటానని అంటున్నాడట. ఒకరకంగా ఇదీ మంచిదే. రాబిన్ హుడ్ కోసం అంత కష్టపడి వెరైటీ పబ్లిసిటీ చేసినా ఫలితం దక్కలేదు. అంతకు ముందు సినిమాలకూ అంతే. తమ్ముడు మాత్రం ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. సీనియర్ నటి లయ చాలా గ్యాప్ తర్వాత నితిన్ అక్కయ్యగా కంబ్యాక్ ఇస్తుండగా కేవలం ప్రొడక్షన్ కే ముపై అయిదు కోట్లు పెట్టడం కంటెంట్ మీద దిల్ రాజు నమ్మకాన్ని సూచిస్తోంది. అది నిలబడితే బ్లాక్ బస్టరే.
Gulte Telugu Telugu Political and Movie News Updates