సినిమా ఇలా రిలీజవ్వగానే.. అలా ప్రత్యక్షమయ్యే ఆన్ లైన్ రివ్యూలపై ఇండస్ట్రీ నుంచి తరచుగా వ్యతిరేక స్వరాలు వినిపిస్తూనే ఉన్నాయి. రివ్యూల వల్ల సినిమాలు చచ్చిపోతున్నాయని.. ఆన్ లైన్ రివ్యూలను నిషేధించాలని.. రిలీజైన కొన్ని రోజుల పాటు అవి బయటికి రాకుండా ఆపాలని ఇండస్ట్రీ జనాలు అభిప్రాయపడుతుంటారు. ఐతే తమిళ సినీ పరిశ్రమలో ఇలా కేవలం డిమాండ్లు చేయడం కాకుండా కార్యాచరణకూ సిద్ధమైపోయారు. ఆన్ లైన్ రివ్యూలు మూడు రోజుల పాటు బయటికి రాకుండా ఆపాలంటూ తమిళ నిర్మాతల సంఘం మద్రాస్ హైకోర్టులో ఇటీవలే పిటిషన్ వేసింది.
ఈ కేసు తాజాగా విచారణకు రాగా.. జస్టిస్ ఆనంద్ వెంకటేశన్ ఆ పిటిషన్‌ను కొట్టివేయడం గమనార్హం. రివ్యూలను నిషేధించడం, మూడు రోజుల పాటు అవి బయటికి రాకుండా చేయడం అంటే.. భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే అని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో రివ్యూలు పోస్ట్ చేయకుండా ఆపడం అసాధ్యమని న్యాయస్థానం స్పష్టం చేసింది.
నిర్మాతలు ఎప్పుడూ పాజిటివ్ రివ్యూలే ఆశించలేరని.. ఏ రంగానికి చెందిన వారైనా సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్‌కు గురవుతున్న విషయాన్ని మరవకూడదని కోర్టు పేర్కొంది. సూర్య హీరోగా తెరకెక్కిన ‘కంగువ’ సినిమాకు సోషల్ మీడియాలో నెగెటివ్ రివ్యూలు రావడం.. సినిమా బాక్సాఫీస్ దగ్గర చతికిలపడడంతో కోలీవుడ్లో రివ్యూల మీద యుద్ధం మొదలైంది. ఆ సమయంలోనే మూడు రోజుల పాటు రివ్యూలను ఆపడం మీద కోలీవుడ్ నిర్మాతల్లో ఆలోచన మొదలైంది. ఈ మేరకు కోర్టుకు వెళ్లారు. కానీ కోర్టులో ఇప్పుడు వారికి చుక్కెదురైంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates