థియేటర్ రన్ అయిపోయింది, జనాలు డిజాస్టర్ తీర్పు ఇచ్చేశారు ఇంకా థగ్ లైఫ్ గురించి ఏంటనుకుంటున్నారా. బొమ్మ ఫ్లాప్ అయ్యింది కానీ దాని తాలూకు నీలి నీడలు కమల్ టీమ్ ని వెంటాడుతూనే ఉన్నాయి. ఇటీవలే దర్శకుడు మణిరత్నం నాయకుడు లాంటి క్లాసిక్ ఇవ్వనందుకు క్షమాపణ కోరడం కోలీవుడ్ లో సెన్సేషన్ అయ్యింది. అంతటి దిగ్గజ దర్శకుడి నోటి వెంట ఆ మాట రావడం మూవీ లవర్స్ ని బాధించింది. కన్నడ వివాదంలో కర్ణాటక రిలీజ్ బ్యాన్ కావడం, కోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చేనాటికి అక్కడ విడుదల చేసే అవకాశం లేకపోవడం లాంటి గాయాలు థగ్ లైఫ్ రిజల్ట్ ని మరింత బ్యాడ్ గా మార్చాయి.
విడుదలకు ముందు నెట్ ఫ్లిక్స్ ని ఒప్పించి ఎనిమిది వారాల విండో తీసుకున్న కమల్ హాసన్ కు ఇప్పుడా అంశమే మెడమీద కత్తిలా మారిపోయిందని చెన్నై టాక్. వివరాల్లోకి వెళ్తే ముందు అనుకున్న ప్రకారం థగ్ లైఫ్ ని రెండు నెలల తర్వాత ఓటిటి రిలీజ్ చేయాలి. అలా అయితే స్పందన మరీ తక్కువగా వస్తుందని భావించి దాన్ని నాలుగు వారాలకు కుదించేలా మళ్ళీ చర్చలు జరిపారట. అయితే దానికి ముందు ఇస్తామన్న నూటా ముప్పై కోట్లలో ముప్పై శాతం తగ్గించి ఇస్తామని నెట్ ఫ్లిక్స్ రివర్స్ ట్విస్ట్ ఇచ్చిందట. ఒకవేళ ఒప్పుకోకపోతే భవిష్యత్తులో కమల్ మూవీస్ కి మంచి రేట్ ఇచ్చే ఈ సంస్థ వాటికి దూరంగా ఉండొచ్చు.
సరే సర్దుకుందాంలే అనుకుంటే ఇక్కడ ఇంకో సమస్య ఉంది. రెండు నెలల ఓటిటి విండో కాబట్టి ఉత్తరాది మల్టీప్లెక్సులు తమ స్క్రీన్లను థగ్ లైఫ్ కు ఇచ్చాయి. ఇప్పుడు కమల్ కనక మాట తప్పితే అసోసియేషన్ నిబంధనలు, అగ్రిమెంట్ ప్రకారం కనీసం 25 లక్షల దాకా ఫైన్ చెల్లించాల్సి ఉంటుందట. ఆ మొత్తాన్ని నష్టపోయిన మల్టీప్లెక్సులకు ఒప్పందం ప్రకారం పంచుతారట. అంటే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఈ పరిణామాలన్నీ కమల్ హాసన్ కు తలనెప్పిగా మారాయని వినికిడి. అయినా ఇప్పుడీ థగ్ లైఫ్ ఓటిటిలో త్వరగా వచ్చినా లేటుగా వచ్చినా పబ్లిక్ అమాంతం ఎగబడి చూసేంత ఓపికతో అయితే లేరు.
Gulte Telugu Telugu Political and Movie News Updates