తెలుగు వాడే అయినా.. తమిళ సినీ పరిశ్రమలో మంచి పేరు సంపాదించిన నటుడు.. శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్. డ్రగ్స్ తీసుకున్నాడన్న ఆరోపణలతో రెండు రోజుల కిందట శ్రీకాంత్‌ను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. ఇలాంటి కేసుల్లో ముందు హడావుడి జరిగినా.. తర్వాత సెలబ్రెటీలు సింపుల్‌గా బయటికి వచ్చేస్తుంటారు. కానీ శ్రీకాంత్ మాత్రం ఈ కేసులో గట్టిగానే ఇరుక్కుపోయినట్లు కనిపిస్తోంది. అతను కోర్టులో తాను మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు కూడా అంగీకరించినట్లు సమాచారం. కోర్టు అతడికి బెయిల్ కూడా ఇవ్వలేదు. శ్రీకాంత్‌కు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది కోర్టు.
ఓ పబ్బులో జరిగిన గొడవ సందర్భంగా అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాద్‌ను పోలీసులు అదుపులో తీసుకుని ప్రశ్నించగా.. అతను శ్రీకాంత్ పేరు బయటపెట్టాడు. తీగ లాగితే డొంక కదిలినట్లు.. శ్రీకాంత్ డ్రగ్స్ వ్యవహారం గురించి సంచలన విషయాలు బయటికి వచ్చాయి. అతను ఏకంగా 40 సార్లు ప్రసాద్ నుంచి డ్రగ్స్ కొన్నట్లు వెల్లడైంది. శ్రీరామ్‌పై మూడు సెక్షన్ల కింద కేసు నమోదుచేసిన పోలీసులు ఆయన్ని సుంగంబాక్కం పోలీస్‌స్టేషన్లో రెండు గంటల పాటు విచారించి అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయనకు రెండుసార్లు పాజిటివ్ వచ్చినట్లు తేలింది. అనంతరం పోలీసులు ఆయన్ని న్యాయస్థానంలో హాజరు పరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
తాను డ్రగ్స్ తీసుకున్న మాట వాస్తవమే అని జడ్జి ముందు అంగీకరించిన శ్రీకాంత్.. తన కొడుకును చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, బెయిల్ మంజూరు చేయాలని కోరగా కోర్టు నిరాకరించింది. ప్రసాద్ తనకు పది లక్షల డబ్బు ఇవ్వాల్సి ఉండగా.. దాని కోసం అడిగినపుడల్లా తనకు కొకైన్ ఇచ్చేవాడని.. రెండుసార్లు తీసుకున్నాక, మూడోసారి నుంచి తనే అతణ్ని కొకైన్ అడగడం మొదలుపెట్టాలని.. అలా దానికి బానిస అయ్యానని శ్రీకాంత్ కోర్టులో చెప్పినట్లు కోలీవుడ్ మీడియా రిపోర్ట్ చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates