హడావిడికి దూరమంటున్న నితిన్

సరిగ్గా ఇంకో పది రోజుల్లో తమ్ముడు విడుదల కానుంది. నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగి ప్రమోషన్లు మొదలుపెట్టారు. దర్శకుడు వేణు శ్రీరామ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండటంతో భారమంతా ఈయన మీదే పడింది. ఇంకా నితిన్ లైన్ లోకి రాలేదు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లోనూ పెద్దగా మాట్లాడలేదు. రాబిన్ హుడ్ కు చేసిన అగ్రెసివ్ ప్రమోషన్ల వల్ల ఎలాంటి ప్రయోజనం కలగకపోవడంతో ఈసారి తమ్ముడుతో హిట్టు కొట్టాక సక్సెస్ మీట్ నుంచి యాక్టివ్ కావాలని నిర్ణయించుకున్నట్టు సన్నిహితుల మాట. పైగా రెండు సినిమాల మధ్య పెద్దగా గ్యాప్ లేకపోవడంతో ఎక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు నితిన్ సుముఖంగా లేదని సమాచారం.

ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఏదైనా ఒకటి రెండు కామన్ ఇంటర్వ్యూలు తప్ప ప్రత్యేకంగా ఒక్కో ప్రతినిధికి విడిగా సమయం కేటాయించే అవకాశం ఉండకపోవచ్చని అంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే నితిన్ ఇలా ఆలోచించడం కరెక్టే. వరస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు మన కన్నా ఎక్కువ కంటెంట్ మాట్లాడాలి. అందులోనూ నితిన్ కు సక్సెస్ పరంగా చాలా గ్యాప్ వచ్చేసింది. అదంతా ఇప్పుడు తమ్ముడుతో పూడ్చాలి. ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించింది. పాటలు ఒక్కొక్కటి వదులుతున్నారు. అవుట్ డోర్ లో రెండు మూడు ప్రోగ్రాంస్ చేశారు  కానీ ఆశించిన ఫలితం దక్కినట్టు లేదు. దిల్ రాజు మాత్రం ఈ సినిమా మీద సాలిడ్ నమ్మకాన్ని చూపిస్తున్నారు.

కుబేర, కన్నప్పల తర్వాత వస్తున్న మూవీగా తమ్ముడు టార్గెట్ పెట్టుకున్నది మాస్ ప్రేక్షకులనే. సిస్టర్ సెంటిమెంట్, యాక్షన్ ఎలిమెంట్స్ రెండూ సమాంతరంగా బ్యాలన్స్ చేసిన వేణు శ్రీరామ్ ఎంసిఏ, వకీల్ సాబ్ కన్నా మెరుగైన అవుట్ ఫుట్ ఇచ్చారని ఇన్ సైడ్ టాక్ ఉంది. సీనియర్ నటి లయ కంబ్యాక్ చేస్తున్న తమ్ముడుకి అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూరుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ టైటిల్ వాడుకోవడం కొంత మేరకు ప్లస్ అవుతోంది. సినిమా కూడా అదే స్థాయిలో ఉంటే నితిన్ కో పెద్ద లోటు తీరిపోయినట్టే. తనతో దిల్ రాజు బ్యానర్లోనే వేణు యెల్దండి దర్శకత్వం వహించే ఎల్లమ్మ త్వరలోనే ప్రారంభం కానుంది.