విశ్వంభర పాటకు హీరోయిన్ దొరికేసింది

విశ్వంభరలో బ్యాలన్స్ ఉన్న ఒకే ఒక్క ఐటెం సాంగ్ కు సమస్య తీరిందని లేటెస్ట్ అప్డేట్. ఏవేవో ఆప్షన్లు చూస్ చివరికి శాండల్ వుడ్ భామని లాక్ చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. తన పేరు నిష్విక నాయుడు. మనకు పరిచయం లేదు కానీ కన్నడ సినిమాలు ఫాలో అయ్యేవాళ్ళు గుర్తుపడతారు. బిచ్చగాడు శాండల్ వుడ్ రీమేక్ అమ్మ ఐ లవ్ యుతో 2018లో వచ్చిన నిష్విక ఇప్పటిదాకా తొమ్మిదికి పైగానే సినిమాలు చేసింది. గత ఏడాది శివరాజ్ కుమార్, ప్రభుదేవాల కరటక దమనకలో నటించింది. పుట్టి పెరిగింది, చదివింది అంతా బెంగళూరులోనే అయినా ఈ అమ్మాయి కుటుంబం మూలాలు తెలుగులోనే ఉన్నాయి.

మరి పెద్దగా పాపులారిటీ లేని అమ్మాయిని ఎంచుకోవడం వెనుక దర్శకుడు వశిష్ఠ స్ట్రాటజీ ఏంటో అర్థం కావాలంటే సాంగ్ చూసే దాకా వెయిట్ చేయాలి. ఈ ఒక్క పాటను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేస్తున్నాడు. ఇది కూడా అఫీషియల్ గా చెప్పలేదు. టీమ్ దాచిపెడితే లీకైపోయింది. అయినా సరే యువి క్రియేషన్స్ సమర్థిస్తూ, ఖండిస్తూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికీ విపరీతమైన ఆలస్యానికి గురైన విశ్వంభర విడుదల వ్యవహారం త్వరలోనే కొలిక్కి రావోచ్చట. అమెజాన్ ప్రైమ్ కు ఓటిటి, జీ ఛానల్ కు శాటిలైట్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది ఇంకా ఖరారుగా తెలియాల్సి ఉంది.

జూలై రాదనే క్లారిటీ వచ్చేయడంతో విశ్వంభరకున్న నెక్స్ట్ ఆప్షన్ ఆగస్ట్. మొదటి రెండు వారాల్లో కింగ్ డమ్, వార్ 2, కూలీ ఉన్నాయి. చివరి వారంలో రవితేజ మాస్ జాతర ఉంది. వీటితో మెగా మూవీ తలపడటం డౌటే. మిస్ అయితే మళ్ళీ సెప్టెంబర్ కు వెళ్లాల్సి ఉంటుంది. అది కూడా ఖాళీగా లేదు. మిరాయ్, ఓజి, అఖండ 2 లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ ఆ నెలలోనే రాబోతున్నాయి. మెగా 157 సంక్రాంతికి బరిలో దింపాలని డిసైడ్ అయిన అనిల్ రావిపూడి మాట వెనక్కు తీసుకునేలా లేడు. అదే జరిగితే విశ్వంభర ఏ నెలలో వస్తుందో ఇంతకీ ఈ ఏడాది రిలీజవుతుందో లేదో అంతుచిక్కని ప్రశ్నగా నిలుస్తోంది.