తెలుగు అమ్మాయిల‌కు 20 ప‌ర్సంటే – నటి ఆవేదన

తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిల‌కు స‌రైన ప్రాధాన్యం ఉండ‌ద‌ని.. వారికి ఆశించిన అవ‌కాశాలు ద‌క్క‌వ‌నే కంప్లైంట్ ఈనాటిది కాదు. ఈ అభిప్రాయాన్ని త‌ప్పు అని కూడా చెప్ప‌లేం. ఇక్క‌డ స్టార్ హోదా సంపాదించిన హీరోయిన్లు చాలా త‌క్కువ‌మందే క‌నిపిస్తారు. రాను రాను అలాంటి వారి సంఖ్య త‌గ్గిపోతోంది. తెలుగు అమ్మాయిల‌కు అవ‌కాశాలు వ‌చ్చినా.. అవి చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాలే అయి ఉంటాయి. ఎక్కువ‌గా క్యారెక్ట‌ర్ రోల్స్‌కే వాళ్ల‌ను తీసుకుంటూ ఉంటారు. ఈ త‌రంలో హీరోయిన్‌గా తన‌దైన ముద్ర వేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న అన‌న్య నాగ‌ళ్ల‌కు సైతం చాలా వ‌ర‌కు చిన్న సినిమాల్లోనే అవ‌కాశాలు ద‌క్కాయి. ఆమె క‌ష్టం మీద టాలీవుడ్లో నెట్టుకొస్తోంది. ఈ నేప‌థ్యంలోనే తెలుగు అమ్మాయిల‌కు టాలీవుడ్లో స‌రైన ప్రాధాన్యం లేక‌పోవ‌డంపై ఒక ఇంట‌ర్వ్యూలో ఆవేద‌న స్వ‌రాన్ని వినిపించింది అన‌న్య‌.

తెలుగు చిత్రాల్లో హీరోయిన్ల‌కు ఉన్న మొత్తం అవ‌కాశాల్లో తెలుగు అమ్మాయిల‌కు కేవ‌లం 20 శాతం మాత్ర‌మే ద‌క్కుతాయని, ఇది క‌ఠోర వాస్త‌వం అని అన‌న్య చెప్పింది. ఈ 20 శాతం అవ‌కాశాల కోస‌మే త‌న లాంటి వాళ్లు ప‌దేళ్ల నుంచి కొట్టుకుంటున్నార‌ని ఆమె వ్యాఖ్యానించింది. మిగ‌తా 80 శాతం అవ‌కాశాలు ప‌ర భాషా హీరోయిన్ల‌కే ఇస్తున్నార‌ని.. వాళ్ల‌కు ఇక్క‌డ మంచి డిమాండ్ ఉంద‌ని ఆమె పేర్కొంది. ఇక్క‌డ ఛాన్సులు లేవు కాబ‌ట్టి వేరే భాష‌ల్లో వెళ్లి ప్ర‌య‌త్నిద్దాం అని చూస్తే.. తమిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ ఇలా ఎక్క‌డ చూసినా.. వాళ్ల ఇండ‌స్ట్రీల్లో 80 శాతం అవ‌కాశాలు సొంత భాష‌కు చెందిన అమ్మాయిల‌కే ఇస్తున్నార‌ని.. 20 శాతం మాత్ర‌మే ప‌ర భాషా హీరోయిన్ల‌కు ద‌క్కుతాయ‌ని ఆమె అంది.

ఒక్క తెలుగులో మాత్ర‌మే దీనికి భిన్న‌మైన ప‌రిస్థితులు ఉన్నాయ‌ని.. ఇక్క‌డ స‌రైన స‌పోర్ట్ సిస్టం లేద‌ని అన‌న్య ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఇలాంటి ప‌రిస్థితుల్లోనూ ఇక్క‌డ నిల‌బ‌డి పోరాడుతున్నారంటే తెలుగు హీరోయిన్ల‌కు ఎంతో గ‌ట్స్ ఉండాల‌ని… అది సామాన్యమైన విష‌యం కాద‌ని ఆమె పేర్కొంది. తాను హీరోయిన్ కావ‌డానికి ప‌డ్డ క‌ష్టాల గురించి కూడా అన‌న్య గ‌తంలో చాలా ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఎన్నో ఇబ్బందుల‌ను త‌ట్టుకుని తాను ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చినా.. త‌న గురించి చుట్టుప‌క్క‌ల వాళ్లు అన్న మాట‌ల‌తో త‌ల్లిదండ్రులు ఎంతో బాధ ప‌డ్డ‌ట్లు ఆమె గ‌తంలో ఆవేద‌న వ్య‌క్తం చేసింది.