సినిమా ప్రమోషన్లలో కంటెంట్ కన్నా ఎక్కువ స్టేట్ మెంట్లతో పబ్లిసిటీ తెచ్చుకున్న దర్శకుడు నరేంద్ర ఫణిశెట్టి 8 వసంతాలు నిన్న థియేటర్లలో విడుదలయ్యింది. కుబేరకు పాజిటివ్ టాక్ రావడంతో దాని ప్రభావం నేరుగా ఈ మూవీ మీద పడింది. ఇది ముందే గుర్తించారు కాబోలు మొన్న హైదరాబాద్ లో ప్రత్యేక ప్రీమియర్ల ద్వారా మీడియా, మూవీ లవర్స్ కు చూపించేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం కావడంతో చెప్పుకోదగ్గ స్థాయిలో స్క్రీన్లు దక్కించుకున్న 8 వసంతాలుకు ఓపెనింగ్స్ రాలేదు. చాలా చోట్ల సింగల్ డిజిట్ ఆడియన్స్ కనిపించగా టాక్ మిశ్రమంగా ఉండటం ఆడియన్స్ ని ఫుల్ చేయలేకపోతోంది.
టీనేజ్ వయసులోనే పుస్తకం రాయడం ద్వారా పేరు సంపాదించుకున్న శుద్ధి అనే అమ్మాయి జీవితంలోకి ఇద్దరు అబ్బాయిలు ప్రవేశిస్తారు. ఊటీలో మొదలైన ఆమె రచన వ్యాసంగం వరుణ్ అనే అబ్బాయి ప్రేమ వల్ల కొత్త మలుపు తీసుకుంటుంది. దానికి సంబంధించి నిర్ణయం తీసుకునే క్రమంలో సంజయ్ ఎంట్రీ ఇస్తాడు. ఈ ముగ్గురి మధ్య ఏం జరిగిందనేది 8 వసంతాలు కథ. పుస్తకాల్లో ఎంతటి భావోద్వేగమైనా నింపొచ్చు. వందల కవితలు రాయొచ్చు. కానీ వాటిని ఒక స్టోరీకి ముడిపెట్టి తెరకెక్కిస్తున్నప్పుడు పొయెటిక్ టచ్ ఉండాలే తప్ప సినిమా మొత్తం పొయెమ్ లా అనిపించకూడదు. నరేంద్ర చేసిన పొరపాటు ఇదే.
ముఖ్యంగా సెకండాఫ్ లో ఈ భావుకతల ప్రవచనాలు ఎక్కువైపోయి కథనం ముందుకు కదలకుండా ఆగిపోతుంది. సుదీర్ఘమైన సన్నివేశాలు, లోతుగా ఆలోచిస్తే తప్ప అర్థం కానీ మాటలు, అవసరానికి మించి సందేశాలు ఇలా ఎన్నో అంశాలు ఓపికకు పరీక్ష పెడతాయి. హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్ నటన, విశ్వనాథరెడ్డి అద్భుతమైన ఛాయాగ్రహణం ల్యాగ్ స్టోరీ టెల్లింగ్ వల్ల వృథా కావడం ట్రాజెడీ. టన్నుల కొద్దీ ఓపికను డిమాండ్ చేసిన 8 వసంతాలు నరేంద్ర ఫణిశెట్టికి బాక్సాఫీస్ హిట్టు సాధించే అర్హత ఇవ్వనట్టే కనిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ సినిమాకు సంబంధించి పెద్దగా సౌండ్ లేకపోవడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates